Rangamarthanda : చిరంజీవి కన్నీళ్ళకు కారణమైన షాయరీ - హార్ట్ టచ్ చేసిన కృష్ణవంశీ
Chiranjeevi's Ft Nenoka Natudni : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి వస్తున్న తాజా సినిమా 'రంగమార్తాండ'. అందులోని 'నేనొక నటుడ్ని...' షాయరీని ఈ రోజు విడుదల చేశారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'రంగమార్తాండ' (Rangamarthanda Movie). ఇందులో ఓ షాయరీ ఉంది. రంగస్థల కళాకారుల గురించి చెప్పేది. దానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గళం అందించారు. అంతే కాదు... గళం అందించే సమయంలో కంటతడి పెట్టుకున్నారు. ఆ వీడియో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి పెంచింది. నేడు ఆ షాయరీ విడుదల చేశారు.
షాయరీలో ఏముంది? అనేది చూస్తే...
''నేనొక నటుడ్ని
చమ్కీల బట్టలేసుకుని
అట్ట కిరీటం పెట్టుకుని
చెక్క కత్తి పట్టుకుని
కాగితపు పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే
చక్రవర్తిని నేను
కాలాన్ని బంధించి శాసించే నియంతను నేను
నేనొక నటుడ్ని
నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని
నేనొక నటుడ్ని
నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకు ఇంకో రెండు రంగులేసి నవరసాలూ మీకిస్తాను
నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బతుకుతుంటాను
నేనొక నటుడ్ని
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను
యుగాలకు మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను
నేనొక నటుడ్ని
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని
నేనొక నటుడ్ని
గతానికి వారధి నేను
వర్తమాన సారథి నేను
రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను
పూటపూటకూ రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను
నేనొక నటుడ్ని
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరం నరం నాట్యమాడే నటరాజు రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను
ప్రచండంగా ప్రకాశించు రంగమార్తాండుడ్ని నేను
నేనొక నటుడ్ని
అసలు మొహం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కానీ 9 తలలు ఉన్న నటరావణుడ్ని
నింగి, నేల రెండు అడుగులైతే
మూడో పాదం మీ మనసుల మీద మోపే వామనుడ్ని
మీ అంచనాలు దాటే ఆజానుబాహుడ్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని
నేనొక నటుడ్ని
అప్సరసల ఇంద్రుడ్ని
అందుబాటు చంద్రుడ్ని
అభిమానుల దాసుడ్ని
అందరికీ ఆప్తుడ్ని
చప్పట్లను భోంచేస్తూ
ఈలలను శ్వాసిస్తూ
అనుక్షణం జీవించే అల్పసంతోషిని నేను
మహా అదృష్టవంతుడ్ని నేను
తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే
సగటు కళాకారుడ్ని నేను
ఆఖరి శ్వాస వరకూ నటనే ఆశ నాకు
నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు''
సగటు కళాకారుల జీవితానికి అక్షర రూపం ఇచ్చినట్టు ఉంది కదూ! కృష్ణవంశీ ఆలోచనలు ప్రతిబింబించే విధంగా రచయిత లక్ష్మీ భూపాల్ రాశారు. షాయరీ చిరు గొంతు నుంచి వినిపిస్తుంటే... వీడియోలో చిరంజీవి ఫోటోలు వచ్చాయి. షాయరీలో చెప్పిన లైన్లకు తగ్గట్టు... ఒక్కో ఫోటో వస్తుంది. అది చిరంజీవి హార్ట్ టచ్ చేసింది. ఆయన కంటతడి పెట్టేలా చేసింది. మెగా అభిమానుల హార్ట్ కూడా టచ్ చేసేలా ఉంది.
Also Read : 'మా బావ మనోభావాలు' - బాలకృష్ణ టార్గెట్ ఎవరు?
అన్నయ్యకు కృతజ్ఞతాభివందనం♥️🙏
— Krishna Vamsi (@director_kv) December 21, 2022
ఇదే ఆ తెలుగు షాయరీ. ఒక అరుదైన ఆలోచనకు లక్ష్మీభూపాల్ అందమైన అక్షరరూపం. సంగీతదైవం ఇళయరాజా గంథర్వస్వరాలతో. నటమర్తాండ అపురూప గళమాథుర్యంలో...
మీకు నచ్చుతుందని ఆశిస్తూ. శుభాకాంక్షలు🙏❤https://t.co/Vmvm9vXhfH @KChiruTweets #NenokaNatudni #Rangamarthanda
'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, శివాత్మికా రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓ మరాఠీ సినిమాకు ఇది రీమేక్. అయితే, ఆ సినిమా కథలో ఆత్మను చెడగొట్టకుండా తనదైన శైలి మార్పులను కృష్ణవంశీ చేశారట. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పాత్రలు... వారి నటన కొన్నాళ్లపాటు మాట్లాడుకునేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. కృష్ణవంశీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతోగానో ఎదురు చూస్తున్నారు.
Also Read : నయనతార తలవంచక తప్పలేదు - థియేటర్స్ యజమానుల మాటే నెగ్గింది