Mohan Raj: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్ కన్నుమూత
Mohan Raj Death: ప్రముఖ నటుడు మోహన్ రాజ్ చనిపోయారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన గుండె సంబంధ సమస్యలతో తుది శ్వాస విడిచారు.
Actor Mohanraj Passed Away: సినీ పరిశ్రమ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ విలన్ మోహన్ రాజ్ తుది శ్వాస విడిచారు. 72 సంవత్సరాల వయసున్న ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. గురువారం మధ్యాహ్నం ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
పార్కిన్సన్స్ తో బాధపడుతున్న మోహన్ రాజ్
నటుడు మోహన్ రాజ్ గత కొద్ది నెలలుగా పార్కిన్సన్స్ తో బాధపడుతున్నారు. రీసెంట్ గా ఆయనకు గుండె పోటు కూడా వచ్చింది. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ కొద్ది రోజుల పాటు వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఇక తమ వల్ల కాదని, ఇంటికి తీసుకువెళ్లాలనని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తిరువనంతపురం సమీపంలోని ఆయన స్వగ్రామం కంజిరంకులంకు తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆయన చనిపోయారు. నటుడు, దర్శకుడు అయిన పి దినేశ్ పనికర్ మోహన్ రాజ్ మరణ విషయాన్ని ధృవీకరించారు. సోషల్ మీడియా వేదికగా మోహన్ రాజ్ చనిపోయినట్లు వెల్లడించారు. నటుడు మోహన్ రాజ్ కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్ మంచి గుర్తింపు
మలయాళంలో మోహన్ రాజ్ ‘కిరిక్కాడాన్ జోస్’గా బాగా పాపులర్ అయ్యారు. 1989లో సిబి మలయిల్ తెరకెక్కించిన ‘కిరీదామ్’ చిత్రంతో ఆయన బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. మలయిల్ ఈ సినిమా కోసం చూడ్డానికి భారీగా కనిపించే నటుడి కోసం వెతికాడు. కనీసం 6 ఫీట్ల ఎత్తు ఉండాలని భావించాడు. అప్పుడే ఆయనకు మోహన్ రాజ్ కనిపించారు. అప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఎన్‌ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ అధికారిక ఉద్యోగం చేస్తున్నారు. అయితే, ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి ఉండటంతో ‘మూన్నం మూర’లో నటించారు. ఈ సినిమా చూసి మలయిల్ తన మూవీలో విలన్ క్యారెక్టర్ కు ఆయను సెలెక్ట్ చేశారు. ఈ చిత్రంలో మోహన్ రాజ్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.
తనలోని విలనిజాన్ని బయటకు తీసి అందరి చేత ఆహా అనిపించారు. ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లోనూ ఆయన నటించారు. ‘లారీ డ్రైవర్’, ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’, ‘చినరాయుడు’, ‘నిప్పు రవ్వ’, ‘శివయ్య’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘చెన్న కేశవరెడ్డి’, ‘శివమణి’ సహా పలు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. తెలుగులో ఆయన చివరగా మోహన్ బాబు నటించిన ‘శివ శంకర్’ చిత్రంలో కనిపించారు. ఆయన మృతి పట్ల తెలుగు, తమిళం, మలయాళం సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read Also: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!