Vijay's Leo Movie: విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోన్న విజయ్ ‘లియో’ మూవీ
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ సినిమాలో విజయ్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేస్తోంది.
తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఆయనకు కేవలం తమిళంలోనే కాదు ఇటు తెలుగుతో పాటు హిందీలోనూ మార్కెట్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘వారిసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్. ఈ మూవీను తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత విజయ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రోమోకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలకు పబ్లిక్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆయన చివరిగా తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. ఇప్పుడు అదే తరహాలో ఈ ‘లియో’ సినిమా కూడా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక ‘లియో’ సినిమాను దాదాపు రూ.250 కోట్లతో నిర్మించారు. ఈ మూవీ విడుదల అవ్వకముందే రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.246 కోట్లు రూపాయలను వసూలు చేసిందీ మూవీ. అందులో డిజిటల్ రైట్స్ నుంచి రూ.150 కోట్లు, శాటిలైట్ రైట్స్ నుంచి రూ.80 కోట్లు, మ్యూజిక్ రైట్స్ నుంచి రూ.16 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాలో విజయ్ కు ప్రత్యర్థి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఆయన గతంలో ‘కేజీఎఫ్ 2’ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించారు. ఆ మూవీ తర్వాత మళ్లీ విజయ్ మూవీలో విలన్ గా చేయడంతో ఆయన లుక్ పై కూడా ఆసక్తి నెలకొంది. ఇక కనగరాజ్, విజయ్ లు కలిసి నటించిన చివరి చిత్రం 'మాస్టర్' బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, సాంగ్స్, ఫైట్స్ అన్ని బాగుండటంతో మూవీ హిట్ టాక్ ను తెచ్చుకుంది.
తాజాగా ఈ ఇద్దరూ 'లియో' కోసం మళ్లీ ఒకటవడంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా ప్రోమో ప్రారంభ దశలో ఇంత భారీ కలెక్షన్లు వస్తాయని ఊహించలేదని తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రమిది. అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క యూట్యూబ్ ప్రోమో కూడా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద విజయాన్ని సాధించింది. షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్', 'టైగర్ 3' వ్యూస్ ను కూడా ‘లియో’ అధిగమించింది. మరి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Also: మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ - ఈ వార్తలు నిజమేనా?