Kantara: ‘కాంతార’ టీమ్‌కు హై కోర్టు షాక్ - ‘వరాహ రూపం’ పాటను బ్యాన్ చేస్తూ తాజా ఉత్తర్వులు
‘కాంతార’ సినిమాకు ప్రాణమైన ఆ పాట వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజై ఇన్నాళ్లవుతున్నా.. ఇంకా వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళ కోర్టు ఈ పాటపై కీలక తీర్పు ఇచ్చింది.
Kantara: కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాంతార’. ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ లో విడుదల అయిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీలో సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ పాటలోని రిషబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాటలోని లిరిక్స్ కూడా అంతే ఆకట్టుకుంటాయి. అయితే ఈ మూవీ విడుదలైన తర్వాత ‘వరాహ రూపం’ పాటను తమ పాట నుంచి కాపీ చేశారంటూ కేరళకు చెందిన తైకుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగింది. ఈ మేరకు కేరళ హై కోర్టు లో పిటిషన్ ను దాఖలు చేసింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ సాంగ్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. అంతే కాదు ఈ పాటను థియేటర్లు, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు, ఓటీటీ వేదికలలో ఎక్కడా ఉపయోగించరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
‘కాంతార’ సినిమా విడుదలైన దగ్గర నుంచి కేరళకు చెందిన తైకుండం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఈ పాటను తమ బాణీ నుంచి కాపీ కొట్టారని ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యలో ఆ బ్యాండ్ న్యాయ పోరాటానికి దిగుతూ కేరళ హై కోర్టు లో పిటిషన్ ను దాఖలు చేసింది. అయితే ముందుగా ఈ పాటను కోర్టు నిషేదించడంతో మరో సరికొత్త సాంగ్ ను రూపొందించి ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ పాట ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే కొద్ది రోజులకు ఈ పాటపై ఉన్న నిషేదాన్ని కోర్టు ఎత్తివేయడంతో యధావిధిగా ఆ పాటను ఉంచేశారు మేకర్స్. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ‘వరాహ రూపం’ పాటను ‘కాంతార’ సినిమా నుంచి నిషేదిస్తూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పాటపై నిషేదం పడింది.
మ్యూజిక్ బ్యాండ్ తైకుదం బ్రిడ్జ్, మాతృభూమి ప్రింటింగ్ కు ‘వరాహ రూపం’ పాట క్రెడిట్ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నవరసం ట్రాక్ ను కాపీ కొట్టి వరాహ రూపం తీసినట్లు కోర్టు చెప్పింది. నవరసం నుంచే ప్రేరణ పొంది వరాహరూపం పాటను క్రియేట్ చేసినట్లు మ్యూజిక్ డైరెక్టర్ అంగీకరించారని కోర్టు తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కన్నడలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో ఈ మూవీను ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా మంచి వసూళ్లను సాధించింది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 450 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.
Read Also: బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిన ‘శాకుంతలం’ - మరీ ఇంత తక్కువ?