Kantara 2: ‘కాంతార-2‘లో సూపర్ స్టార్ కీలకపాత్ర? రిషబ్ శెట్టి మౌనం వెనుక అర్థం అదేనా?
‘కాంతార’ సంచలన విజయం సాధించడంతో ఆ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీ అయ్యారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.
రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’. తొలుత కన్నడలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లోకి అనువాదమై విడుదలైంది. ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రతి చోటా సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా రేంజిలో కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అందుకుంది. రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ ఉంటుందని రిషబ్ శెట్టి వెల్లడించారు. ఇదే విషయాన్ని హొంబలే ఫిల్మ్స్ సంస్థ కూడా ధృవీకరించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.
‘కాంతార-2’లో రజనీకాంత్ కీలక పాత్ర?
తాజాగా బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రిషబ్ శెట్టి ‘కాంతర’ విజయం, ‘కాంతార’ ప్రీక్వెల్ గురించి మాట్లాడారు. “’కాంతార’కు సంబంధించి స్క్రిప్ట్ రూపొందించే పనిలో ఉన్నాం. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ ప్రీక్వెల్‌లో ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌లకు గురవుతారు. సినిమా జానర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది’’ అని వెల్లడించారు. ఈ సందర్భంగా ‘కాంతార-2’లో సూపర్‌స్టార్ రజనీకాంత్ కనిపిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. నిజంగానే తను ఈ సినిమాలో నటించే అవకాశం లేకపోతే తను లేదు అని చెప్పేవారు. మౌనంగా ఉన్నారంటే కచ్చితంగా నటించబోతున్నారని భావిస్తున్నారు. సినీ లవర్స్ సైతం ‘కాంతార-2’లో రజనీకాంత్ ఉంటారని నమ్ముతున్నారు.
మొదటి నుంచి ‘కాంతార’పై రజనీ ఆసక్తి
‘కాంతార’ విడుదలైనప్పుడు ఈ సినిమాపై రజనీ కాంత్ ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత రిషబ్ శెట్టి చెన్నైకి వెళ్లి రజనీకాంత్ ను కలిశారు. సినిమా గురించి చర్చించారు. ఈ సందర్భంగా రిషబ్ ను బంగారు కానుకతో సన్మానం చేశారు. తొలి నుంచి ఈ సినిమా పట్ల రజనీకాంత్ కు పాజిటివ్ దృక్పథం ఏర్పడింది.
‘కాంతార’ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గత నెలలో ‘కాంతార-2’ని ప్రకటించారు రిషబ్ శెట్టి. “’కాంతార’పై చూపించిన అపారమైన ప్రేమను, ఆదరణకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రీక్వెల్‌ను ప్రకటించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు. మీరు చూసింది పార్ట్ 2, పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుంది" అని రిషబ్ చెప్పాడు.
View this post on Instagram
Read Also: నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ కాకుండా మరో యంగ్ హీరో?