Kangana Ranaut: పాలిటిక్స్ తోనే సరిపోతుంది, వాటికి అస్సలు టైమ్ దొరకట్లేదన్న కంగనా రౌనత్
సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కంగనా హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. రాజకీయాలతో ఫుల్ బిజీగా మారినట్లు చెప్పిన ఆమె.. సినిమాలు చేసే తీరిక దొరకట్లేదన్నారు.
Kangana Ranaut About Her Films: రాజకీయాలు తన సినీ కెరీర్ కు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ప్రముఖ నటి, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ అన్నారు. పూర్తి సమయం రాజకీయాలతోనే సరిపోతుందని, సినిమాలు చేసే అవకాశం దొరకడం లేదన్నారు. కంగనా నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదల చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. మొత్తంగా ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేసేందుకు చిత్రబృందం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా, కీలక విషయాలు వెల్లడించారు. సినిమాలతో పాటు తన పొలిటికల్ కెరీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టైం అంతా రాజకీయాలకే సరిపోతుంది- కంగనా
ఎంపీగా విజయం సాధించిన తర్వాత తన బాధ్యతలు మరింత పెరిగాయని కంగనా రనౌత్ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పని చేయడంతోనే టైం అంతా గడిచిపోతుందని చెప్పారు. ఈ ఎఫెక్ట్ తాను అంగీకరించిన సినిమాల మీద పడుతోందన్నారు. “ఎంపీగా బాధ్యతలు నిర్వహించడం అనేది ఓ సవాల్ తో కూడిన వ్యవహారం. నా నియోజకవర్గం మండిలో వరుదల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రాంతాలు వరదలతో ఇబ్బంది పడుతున్నాయో ఎప్పటికప్పుడు రివ్యూలు చేయాల్సి ఉంటుంది. వాటకి తోడు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి పనిచేయాల్సి వస్తోంది. రాజకీయ బాధ్యతల కారణంగా సినిమా కెరీర్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎంపీగా గెలవడానికి ముందు నేను సైన్ చేసిన కొన్ని సినిమాలు నా డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ షూటింగులలో పాల్గొనే పరిస్థితి లేదు. పార్లమెంట్ సమావేశాలలో చాలా బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డేట్స్ అడ్జెస్ట్ చేసుకునే పనిలో ఉన్నాను” అని కంగనా చెప్పుకొచ్చారు. అయితే, రాజకీయాలతో పాటు సినిమాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తానని ఆమె వెల్లడించారు. ఆయా సమయాల్లో ఏది ఎక్కువ ముఖ్యం అనుకుంటే దానికి టైమ్ కేటాయిస్తానని వివరించారు.
ఆగష్టు 15న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ విడుదల
అటు తన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’కి సంబంధించి కొత్త పోస్టర్ ను కంగనా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో ఇందిరా హయాంలో జరిగిన చీకటి రోజులను గుర్తు చేయనున్నారు. ‘మణికర్ణిక’ తర్వాత కంగనా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టితో కలిసి కంగనా రనౌత్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీలో దివంగత నటుడు సతీష్ కౌశిక్, అనుపమ కేర్, శ్రేయస్ తల్పడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.
View this post on Instagram