రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!
'ఇండియన్ 2' చిత్రంతో మరో కొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యూనివర్సల్ హీరో కమల్ హాసన్..హీరో రజనీ కాంత్ సినిమాను నిర్మించబోతున్నారు. దీనిపై చర్చలు కూడా సాగాయని కమల్ హాసన్ తాజాగా వెల్లడించారు.
Kamal Haasan : 'ఇండియన్ 2' చిత్రీకరణలో బిజీగా ఉన్న కమల్ హాసన్.. ప్రస్తుతం Nexa IIFA 2023 కోసం UAEలో ఉన్నారు. కమల్ ఇండియన్ 2 యొక్క చివరి దశ షూటింగ్‌ను పునఃప్రారంభించే ముందు అబుదాబిలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన రజనీ కాంత్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
IIFA అవార్డ్స్ 2023లో భారతీయ సినిమాలో అత్యుత్తమ అచీవ్‌మెంట్‌ని అందుకోవడానికి కొన్ని గంటల ముందు యాస్ ఐలాండ్‌లోని డబ్ల్యూ హోటల్‌లో విలేకరుల సమావేశంలో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం గురించి, అబుదాబిలో ఉండటం గురించి తన అభిప్రాయాలను పంచుకున్న కమల్ హాసన్.. తాను నటించబోయే భారతీయుడు 2 మూవీపైనా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే రజనీ కాంత్ సినిమాను నిర్మించడంపై చర్చలు జరిగాయన్నది వాస్తవవమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో..
భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే రజనీ కాంత్ సినిమాపై రెండు నెలల్లో కన్ఫర్మేషన్ వెలువడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్, కమల్ హాసన్ తమ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాపై పనులు కాస్త ఆలస్యమవుతున్నట్టు సమాచారం. ఆగష్టు- సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెలువడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి 'విక్రమ్' మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారని, అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తారని సమాచారం.
మణిరత్నంను కలిసిన కమల్..
ఇదిలా ఉండగా కమల్ హాసన్ తన నెక్స్ట్ చిత్రం కోసం దర్శకుడు మణిరత్నంను కలిశారు. దీనికి తాత్కాలికంగా ' KH 234' అని టైటిల్ కూడా పెట్టారు. ఈ టైటిల్ ను ఇటీవల జరిగిన కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కాగా ఈ సినిమాపైనే పలు విషయాలపై చర్చిస్తున్నానని, ఇంతకుముందు నాయకన్ మాదిరిగానే మరోసారి మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన వెల్లడించారు.
'KH 234' మూవీ షూటింగ్ మరో రెెండు లేదా మూడు నెలల్లో ప్రారంభం కానున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన, నటి త్రిష నటించనుందనే వార్తలు వస్తున్నాయి. త్రిష ఇంతకుమునుపు కమల్ హాసన్ తో కలిసి మన్మధన్ అంబు, తూంగవనం చిత్రాల్లో నటించింది. ఇటీవల ఈ సినిమాపై వస్తోన్న వార్తలే గనక నిజమైతే.. కమల్ హాసన్ తో త్రిషకు ఇది మూడో చిత్రం కానుంది.
కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ తో కలిసి 'ఇండియన్ 2'లో చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా 1996లో వచ్చిన తమిళ చిత్రానికి సీక్వెల్. ఆ తర్వాత ఆయన 'సేనాపతి'లో కనిపించనున్నారు.