Telugu Movies in January 2024: సంక్రాంతికి ఐదు, రిపబ్లిక్ డేకు నాలుగు - ఈ నెల అన్నీ క్రేజీ మూవీసే!
Telugu Movies In January: కొత్త సంవత్సరంలో కొత్త మూవీస్ ప్రేక్షకులను అలరించబోతున్నాయి. జనవరిలో తెలుగుతో పాటు ఇతర భాష చిత్రాలు కూడా ప్రేక్షకులను వినోదాన్ని పంచబోతున్నాయి. ఇంతకీ ఆ మూవీస్ ఏవంటే?
January 2024 Telugu Movie Releases: సంక్రాంతి పండుగ అనగానే సినీ పరిశ్రమలో కొత్త జోష్ నెలకొంటుంది. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ వేళ సినిమాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఉవ్విళ్తూరుతుంటారు. రిపబ్లిక్ డే సందర్భంగానూ పలు సినిమాలు రిలీజ్ అవుతాయి. మొత్తంగా జనవరి నెలంతా కొత్త సినిమాల సందడి నెలకొనబోతోంది.
‘సర్కారు నౌకరి’తో కొత్త సంవత్సరం ప్రారంభం
2024లో విడుదలైన తొలి చిత్రంగా ‘సర్కారు నౌకరి’ గుర్తింపు తెచ్చుకుంది. గాయని సునీత కొడుకు ఆకాష్ హీరోగా, భావన వళపండల్ హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కింది. దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మించారు. 1996లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జనవరి 1న రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అటు శివ కంఠమనేని, రాశి కలిసి నటించిన మూవీ ‘రాఘవరెడ్డి’. నందిత శ్వేత కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను సంజీవ్ మేగోటి తెరకెక్కించారు. ఈ చిత్రం జనవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అదే రోజున మనోజ్, చాందిని హీరో హీరోయిన్లుగా నాగరాజు బోడెం దర్శకత్వంలో తెరకెక్కిన ‘14 డేస్ లవ్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంక్రాంతికి తెలుగు సినిమాల ధూంధాం సందడి!
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పలు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘గుంటూరు కారం’ జనవరి 12న విడుదల కాబోతుంది. అదే రోజున యువ నటుడు తేజ సజ్జ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ‘హనుమాన్’ కూడా విడుదల అవుతోంది.
- వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను తెరకెక్కించిన ‘సైంధవ్’, మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వస్తున్న ‘ఈగల్’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
- అక్కినేని నాగార్జున హీరోగా, విజయ్ బిన్నీ రూపొందించిన ‘నా సామిరంగ’ జనవరి 14న థియేటర్లలోకి అడుగు పెట్టబోతోంది.
- సంక్రాంతి కానుకగా పలు తమిళ సినిమాలు కూడా క్యూ కట్టాయి. అయితే, ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’ తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యే అవకాశాలు లేవు. విజయ్ సేతుపతి ‘మెరీ క్రిస్మస్’ జనవరి 12న రిలీజ్ అని ప్రకటించారు. ఇది కూడా రిలీజ్ అనుమానమే.
రిపబ్లిక్ డే రోజున ఇతర భాషల సినిమాల సందడి
రిపబ్లిక్ డే సందర్భంగానూ పలు సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ, ఈసారి తెలుగు నుంచి పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. ఇతర భాషల సినిమాలు అలరించనున్నాయి.
- విక్రమ్ హీరోగా రంజిత్ పా తెరకెక్కించిన ‘తంగలాన్’ రిలీజ్ కాబోతోంది.
- హన్సిక ప్రధాన పాత్రలో రాజ్ దుస్స దర్శకత్వంలో తెరకెక్కిన ‘105 మినిట్స్’ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.
- రజనీకాంత్ ‘లాల్ సలామ్’ కూడా అదే రోజున విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
- హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’, మోహన్ లాల్ ‘మలైకోటై వాలిబన్’ ఈ నెల 25న రిలీజ్ కానున్నాయి.
Read Also: షూటింగ్ కంప్లీటైన 8 ఏళ్లకు రిలీజ్ అవుతున్న తమన్నా మూవీ, అదీ ఓటీటీలో!