Lakshmi Menon: సినిమాల్లో హీరోయినే కానీ నిజ జీవితంలో రౌడీ - బార్ దగ్గర గొడవ ..ఐటీ ఉద్యోగి కిడ్నాప్ - లక్ష్మి మీనన్‌పై కేసు
Actress Lakshmi Menon Case: మలయాళ హీరోయిన్ లక్ష్మీమీనన్ కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఓ బార్ దగ్గర గొడవ జరగడంతో ఓ ఐటీ ఉద్యోగిని కొట్టి, కిడ్నాప్ చేసినట్లుగా ఆమెపై కేసు నమోదు అయింది.

IT employee beaten up by actress Lakshmi Menon: తెర మీద అమాయకంగా కనిపిస్తుంది కానీ.. తెర వెనుక మాత్రం రౌడీ వేషాలు వస్తారని హీరోయిన్ లక్ష్మీ మీనన్‌పై ఆరోపణలు వస్తున్నాయి. కేరళలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిపై అపహరణ , దాడి జరిగిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో నటి లక్ష్మీ మీనన్ కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆగస్టు 24, 2025 రాత్రి ఎర్నాకులం నార్త్ రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ వద్ద జరిగింది, ఇది స్థానిక బార్‌లో రెండు గ్రూపుల మధ్య జరిగిన వివాదం నుంచి ప్రారంభమైంది.
ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, ఆగస్టు 24 రాత్రి 11 గంటల సమయంలో కొచ్చిలోని బెనర్జీ రోడ్‌లో ఉన్న ఒక రెస్టోబార్‌లో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం రోడ్డుపైకి చేరుకుంది, ఫిర్యాదు చేసిన ఐటీ ఉద్యోగి అలియార్ షా సలీమ్ , అతని స్నేహితులు తమ కారులో బయలుదేరారు. అయితే, లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులైన మిథున్, అనీష్, సోనమోల్‌లతో కూడిన గ్రూప్ వారి కారును వెంబడించి, ఎర్నాకులం నార్త్ రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ వద్ద అడ్డగించారు.
సీసీటీవీ ఫుటేజ్, స్థానిక రిపోర్ట్ ప్రకారం లక్ష్మీ మీనన్, ఆమె గ్రూప్ రోడ్డును అడ్డగించారు. ఫిర్యాదుదారుని బలవంతంగా అతని కారు నుంచి లాగి, నిందితుల కారులోకి తీసుకెళ్లారు. కారులో అతనిపై దాడి చేసి, ముఖం, శరీరంపై గాయాలయ్యేలా కొట్టారు. బెదిరింపులు, అసభ్య పదజాలంతో దూషించారు. ఆ తర్వాత, అర్ధరాత్రి సమయంలో అతన్ని పరవూర్ జంక్షన్ వద్ద విడిచిపెట్టారు. బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, మిథున్ , అనీష్ న, సోనమోల్నలను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లోని వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆమె కోసం పోలీసులు ఇంటికెళ్లారు. కానీ అక్కడ లేరని గుర్తించారు. కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య ఈ ఘటనలో లక్ష్మీ మీనన్ ప్రమేయం ఉన్నట్లు ధృవీకరించారు. త్వరలో విచారణకు పిలిపించనున్నట్లు తెలిపారు. పోలీసులు ఈ కేసులో లక్ష్మీ మీనన్ పాత్రను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఆధారాలు, ఫిర్యాదుదారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా, ఆమె సంఘటన సమయంలో అక్కడ ఉన్నట్లు ధృవీకరించారు. అరెస్టయిన నిందితుల్లో ఒకరైన సోనమోల్ ఫిర్యాదు ఆధారంగా, ఫిర్యాదుదారు గ్రూప్‌లోని ఒక సభ్యుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై దర్యాప్తు కొనసాగుతోంది.
లక్ష్మీ మీనన్ ప్రధానంగా తమిళ సినిమాల్లో నటిస్తన్నారు. 2011లో మలయాళ చిత్రం 'రఘువింటే స్వంతం రజియా'లో సహాయక పాత్రలో నటించారు. 2012లో తమిళ చిత్రం 'సుందరపాండియన్'లో హీరోయిన్ గా నటించారు. 'కుమ్కి', 'జిగర్తాండ', 'వేదాలం', 'చంద్రముఖి 2' వంటి చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్, రెండు SIIMA అవార్డులను గెలుచుకున్నారు. ఆమె చివరిగా షాహి కబీర్ దర్శకత్వంలో 'రోంత్' చిత్రంలో కనిపించారు.





















