Bigg Boss Telugu Season 6: నాగార్జున గారు, ఈ కంటెస్టెంట్లతో కష్టమే - గత ‘బిగ్ బాస్’ షోలకు, సీజన్ 6కు తేడాలివే!
‘బిగ్ బాస్’ ఒకప్పటి సీజన్స్‌తో పోల్చితే సీజన్-6 చాలా డల్‌గా ఉందనే అభిప్రాయం నెలకొంది. మరి లోపం ఎందులో ఉంది? కంటెంట్‌లోనా? కంటెస్టెంట్లలోనా?
‘బిగ్ బాస్’ అంటే బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. స్టార్ మాలో ‘బిగ్ బాస్’ వస్తుందని తెలియగానే ప్రేక్షకుల్లో ఉత్కంఠత మొదలవుతుంది. ఈ సీజన్లో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కంటెస్టెంట్లు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఇప్పటివరకు ‘బిగ్ బాస్’ తెలుగులో ప్రసారమైన సీజన్లు అన్నీ ప్రేక్షకులను బాగా అలరించినవే. చివరికి ‘బిగ్ బాస్’ ఓటీటీ వెర్షన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ సైతం ఆకట్టుకుంది. ఎందుకంటే, అందులో పాల్గొన్న పాత కంటెస్టెంట్లను మినహాయిస్తే.. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి, స్రవంతి చొక్కారపు, యాంకర్ శివ, ఆర్జే చైతూ, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిత్ర శర్మ, అజయ్ తదితర కంటెస్టెంట్లు ఆకట్టుకున్నారు. చివరికి.. బిందు మాధవి - అఖిల్‌కు మంచి ఫైట్ ఇవ్వడంతో ఆసక్తి నెలకొంది. అప్పటివరకు ఓటీటీ వెర్షన్ బోరింగ్ అనుకున్నవారు సైతం చివర్లో ఆసక్తిగా ‘బిగ్ బాస్’ను వీక్షించడం మొదలుపెట్టారు.
అయితే, ‘బిగ్ బాస్’ సీజన్-6 చూస్తుంటే.. ఏదో లోటు కనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ సీజన్ నుంచి మొదలకుని నాన్ స్టాప్ సీజన్ వరకు ఏదో ఒక వివాదం లేదా, ఆసక్తికర ఘటనలతో ‘బిగ్ బాస్’ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడు. అందుకే, ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ షోగా తన సత్తా చాటింది. కానీ, ఈ సీజన్ చాలా చప్పగా సాగుతోందనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఉంది. చివరికి ‘బిగ్ బాస్’ కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కంటెంట్ ఇవ్వడం లేదంటూ కంటెస్టెంట్లకు తలంటు పోశాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు ఎంత కంటెంట్ ఇచ్చినా.. అది ఓవర్ యాక్షన్‌లా అనిపించిందే గానీ, ప్రేక్షకుడి మనసు తాకలేపోయింది. దీనికి తగినట్లు గీతూ వైఖరి కూడా కొంతమందికి నచ్చలేదని టాక్. అయితే, ఆమె వల్లే బిగ్ బాస్ హౌస్‌లో ఏదో వివాదంతో వార్తల్లో ఉంటుందోనే భావన కూడా ఉంది. ఇప్పుడు గీతూ కూడా ఎలిమినేట్ కావడంతో హౌస్ మరింత బోసిపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇనయా మాత్రమే సింగిల్‌గా హౌస్‌మేట్స్‌తో పోరాడుతూ ఆడియన్స్ సింపథీని పొందగలుగుతోంది.
ఎందుకు ఆకట్టుకోవడం లేదు?:
కర్ణుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్లే. ‘బిగ్ బాస్’ ప్రస్తుత సీజన్ ఆకట్టుకోకపోవడానికి కూడా చాలా కారణాలున్నాయి. వాటిలో మొదటిది.. సరైన కంటెస్టెంట్లను ఎంపిక చేసుకోకపోవడమనేది ప్రేక్షకుల ప్రధాన అభిప్రాయం. ఔనండి, గత సీజన్లతో పోల్చితే యూత్‌ను ఆకట్టుకొనే కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేరనే టాక్ నడుస్తోంది. పైగా వారిలో చాలామంది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారేనని, వీరికి అభిమానులు కూడా చాలా తక్కువే అని ‘బిగ్ బాస్’ అభిమానులే అంటున్నారు. బాలాదిత్య, రేవంత్, ఫైమా, చంటీ, శ్రీహాన్ మినహా మిగతావాళ్లు ఎవరూ పెద్దగా తమకు పరిచయం లేరని షో మొదట్లోనే ట్రోల్స్ నడిచాయి. అయితే, సీరియల్స్ చూసేవారికి కీర్తి, సత్య, మరీనా, రోహిత్‌లు తెలుసు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి గీతూ, ఆదిరెడ్డి కాస్త తెలుసు. కానీ, చాలామంది సాధారణ ప్రేక్షకులకు వారెవరో కూడా తెలీదు. పైగా వారు పెద్ద సెలబ్రిటీలు కూడా కాదు. ప్రస్తుతం బిగ్ బాస్‌లో అడుగుపెట్టిన తర్వాతే వారు సెలబ్రిటీలుగా మారొచ్చు. కానీ, వీరంతా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారేమో అనిపిస్తోందని ట్రోలర్స్ అంటున్నారు.
ఎందుకంటే, ఇప్పటివరకు వీరిలో ఎవరూ ప్రేక్షకుల మెప్పును పొందినవారు లేరు. ఉన్నవారిలో బాలాదిత్య, రాజశేఖర్ పర్వాలేదనిపిస్తున్నారు. ఇనయా ముక్కు సూటిగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ మంచి మార్కులే కొట్టేస్తోంది. దానివల్ల హౌస్ సభ్యులంతా ఆమెను దూరం పెడుతున్నారు. అది ఇనయాకు కలిసిస్తోంది. ఆర్జీవీ ఫ్యాన్స్ కూడా ఆమెకు అండగా ఉండటంతో ఎలిమినేషన్స్‌లో సేవ్ అవుతోంది. నవ్విస్తుందనుకున్న ఫైమా కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే, ఆమె నేపథ్యం.. ఆ స్థాయికి చేరడానికి ఆమె పడిన కష్టాలను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆమె కాస్త ఫన్ క్రియేట్ చేస్తూ సాగితే తప్పకుండా టాప్-5లోకి చేరుతుంది.
సిరి బాయ్ ఫ్రెండ్ ట్యాగ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన శ్రీహాన్ కూడా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతున్నాడేమో అనిపిస్తోంది. శ్రీహాన్ ఎక్కువ ఇనయాతో గొడవపడటం.. శ్రీసత్య, గీతూలతో చేరి తొండాట ఆడటం ప్రేక్షకులకు నచ్చడం లేదు. నామినేషన్ల టైమ్‌లో ఇనయానూ చూస్తూ అతడి చేస్తున్న వెకిలి చేష్టలు సైతం.. చైల్డిష్‌గా అనిపిస్తున్నాయి. శ్రీసత్య కూడా బాగా సతాయిస్తోంది. గీతూ తర్వాత బయటకు వెళ్లిపోయేది ఆమె అనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ తన ఆగ్రహం, అలకలతో విసుగు తెప్పిస్తున్నాడు. బాలాదిత్య నీతి సూక్తులు, అతి మంచితనం కూడా ఈ షోకు యూజ్ కావు. కాస్త సరదా, మరికాస్త సీరియస్, మరికొంత ఉత్కంఠత.. ఇలా సాగితే ప్రేక్షకుడు తర్వాతి రోజు ఎపిసోడ్ కోసం ఎదురుచూడగలడు. గత సీజన్లు హిట్ కావడానికి ఇదే కారణం. రాహుల్ సిప్లిగంజ్, కౌశల్ మంద, అభిజీత్, సన్నీ తరహాలో ఆకట్టుకొనే కంటెస్టెంట్ ఒక్కరు కూడా ఈ సీజన్లో లేరనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది.
హౌస్‌లో ఉన్నవాళ్లంత ఒకరి గురించి ఒకరు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారేమో. కానీ, ప్రేక్షకులు.. వారిని ఎప్పుడో చదివేశారు. సో, ఇప్పటికి ఇప్పుడు వారిలో మార్పు వచ్చి కంటెంట్ ఇచ్చినా.. పెద్దగా ఎక్కదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎవరినైనా పెద్ద సెలబ్రిటీని ఇంట్లోకి పంపితేనే.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచవచ్చు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌస్ తెలిసి తెలియని సెలబ్రిటీల నిలయంగా ఫేడ్ అవుతోంది. గత సీజన్లలో ఫుల్ మస్తీ ఇచ్చిన శ్రీముఖి, లాస్య, శ్యామలా వంటి యాంకర్లు కూడా ఈ షోలో లేకపోవడం పెద్ద లోటు అనే అభిప్రాయం ఉంది. షో ఇలాగే కొనసాగితే.. తర్వాతి సీజన్‌పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గిపోతాయని విశ్లేషకులు అంటున్నారు. మరి ‘బిగ్ బాస్’ మేలుకుని నష్ట నివారణ చర్యలు చేస్తాడో లేదో చూడాలి. ‘బిగ్ బాస్’లో నవదీప్, శివ బాలాజీ, వేద, హరితేజ, అభిజీత్, వరుణ్ సందేష్, తనీష్, ప్రిన్స్ వంటి పరిచయం ఉన్న స్టార్స్‌ను చూసిన కళ్లు.. ఇప్పుడున్న కంటెస్టెంట్లను చూడలేకపోతున్నాయనే భావన ప్రేక్షకుడు వ్యక్తం చేస్తున్నాడు. మరి, ‘బిగ్ బాస్’ మళ్లీ అలాంటి స్టార్లను రంగంలోకి దింపి.. కలర్ ఫుల్‌గా ట్రీట్మెంట్ ఇస్తాడో లేదో చూడాలి.
ఇప్పటికైనా ఆలస్యం కాలేదు.. ఇంకో 40 రోజులపాటు ‘బిగ్ బాస్’ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డుతో ప్రేక్షకుడిని అలరించే కంటెస్టెంట్‌ను పంపండి ‘బిగ్ బాస్’!!
గమనిక: సోషల్ మీడియా, ప్రేక్షకుల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ విశ్లేషణను యథావిధిగా అందించామని గమనించగలరు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.