I Hate You Movie: దేవుడు కాదు, మనుషులే అన్యాయం చేస్తున్నారు - ఇద్దరమ్మాయిల జీవితాల్లో...
కార్తీక్ రాజు నటించిన 'ఐ హేట్ యు' శుక్రవారం విడుదల అవుతోంది. ఇద్దరు అమ్మాయిలు, హీరో మధ్య సైకలాజికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది.
కార్తీక్ రాజు కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఐ హేట్ యు'. శుక్రవారం... ఈ నెల (ఫిబ్రవరి 2న) థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాలో మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లు. బి. లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగరాజ్ నిర్మించారు. అంజి రామ్ దర్శకత్వం వహించారు.
సైకలాజికల్ లవ్ స్టోరీగా 'ఐ హేట్ యు'
'ఐ హేట్ యు' ద్వారా ప్రేమలో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నామని, ఇప్పటి వరకు చూసిన ముక్కోణపు ప్రేమకథలకు ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అది చూస్తే... ప్రాణ స్నేహితులైన ఇద్దరు అమ్మాయిల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా అర్థం అవుతోంది.
'నిన్ను ఎప్పుడూ వదిలి వెళ్లను' అని ఓ అమ్మాయికి మరో అమ్మాయి చేసే ప్రామిస్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత వారి మధ్య స్నేహాన్ని ఆవిష్కరించారు. స్కూల్ లైఫ్ నుంచి టీనేజ్ లైఫ్ వరకు చూపించారు. ఆ తర్వాత ఆ ఇద్దరి జీవితాల్లోకి ఒక హీరో వస్తాడు. అప్పుడు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 'దేవుడు కాదు... ఈ మనుషులే మనకు అన్యాయం చేస్తున్నారు' డైలాగ్ వింటే ఎవరు ఎవర్ని మోసం చేశారు? అని ఆసక్తి కలిగించేలా ఉంది.
స్నేహం, ప్రేమ బంధాల చుట్టూ సాగే కథలా 'ఐ హేట్ యు' కనిపిస్తోంది. అంతకు మించిన థ్రిల్లింగ్ పాయింట్, క్రైమ్, సస్సెన్స్ డ్రామాను కూడా సినిమాలో చూడవచ్చని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రొమాంటిక్ సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో యాక్షన్, రొమాంటిక్ సీన్స్ ట్రైలర్‌లో హైలెట్ అవుతున్నాయి.
Also Read: 'దిల్' రాజు ఇంట్లో పెళ్లి సందడి - యంగ్ హీరోకి కాబోయే భార్య ఎవరంటే?
నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ... ''ఇదొక సైకలాజికల్ లవ్ స్టోరీ. అంజి రామ్ గారు డిఫరెంట్ సబ్జెక్ట్ రాశారు. కొత్త పంథాలో సినిమాను చక్కగా తెరకెక్కించారు. హీరో కార్తీక్ రాజుకు నటుడిగా మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. హీరోయిన్లు మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా నటీనటులు అందరూ క్యారెక్టర్లకు తగ్గట్టు నటించారు. ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు చక్కటి సహకారాన్ని అందించటంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తి చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది'' అన్నారు.
కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఒరిజినల్ స్టోరి, డైలాగ్స్: ప్రభోద్, ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్, స్టంట్స్: రామకృష్ణ, కొరియోగ్రాఫర్: అనీష్, అసోసియేట్ నిర్మాత: అనూష, సహ నిర్మాతలు: విష్ణు తేజ సర్విశెట్టి, నిర్మల్ కుమార్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్. మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: సాకార్, చిత్ర సమర్పణ: బి. లోకనాథం, నిర్మాణ సంస్థ: శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: నాగరాజు, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అంజి రామ్.