Radhe Shyam New Release date: 'రాధే శ్యామ్' రిలీజ్ ఎప్పుడు? 'ఆర్ఆర్ఆర్' కంటే ముందేనా?
'ఆర్ఆర్ఆర్' కంటే ముందు 'రాధే శ్యామ్'ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. సినిమాను ఎప్పుడు థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారంటే?
'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' - ఈ ప్రశ్నకు సమాధానం 'బాహుబలి 2'లో దొరికేసింది. అయితే... ఆ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్', హీరో ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' సినిమాలు ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా దొరకడం లేదు. బహుశా... కొవిడ్ అంతం అయితే తప్ప ఎవరూ క్లారిటీగా చెప్పలేరు ఏమో! అయితే మార్చి 18 లేదంటే ఏప్రిల్ 28న 'ఆర్ఆర్ఆర్'ను విడుదల చేస్తామని చెప్పారు. మరి, 'రాధే శ్యామ్' సంగతి ఏంటి? ఈ సినిమా విడుదల ఎప్పుడు? అంటే...
'రాధే శ్యామ్' నిర్మాతలు రెండు విడుదల తేదీలను పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే మార్చి తొలి వారం... లేదంటే రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారట. అన్నీ కుదిరితే... మార్చి 4 లేదంటే 11న సినిమా విడుదల కావచ్చు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ టీమ్ కొవిడ్ పరిస్థితులను బట్టి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఓ పక్క 'రాధే శ్యామ్'ను థియేటర్లలో విడుదల చేయాలని టీమ్ సన్నాహాలు చేస్తుంటే... మరోపక్క దేశంలో కొవిడ్ పరిస్థితులు, వివిధ రాష్ట్రాల్లో కరోనా లాక్‌డౌన్స్ కారణంగా ఓటీటీలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారని గాసిప్స్ గుప్పుమన్నాయి. వీటికి దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఫుల్ స్టాప్ పెట్టారు. థియేటర్లోనే సినిమాను విడుదల చేస్తామని ఆయన ట్వీట్ చేశారు.
'రాధే శ్యామ్' సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని గతంలో కూడా వార్తలు వచ్చాయి. సంక్రాంతికి ముందు సినిమా ప్రచారం మీద కంటే ఆ వార్తలను ఖండించడం మీద యూనిట్ ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. విజువల్ వండర్ కింద తెరకెక్కించిన 'రాధే శ్యామ్'ను ఓటీటీలో చూపిస్తే ప్రేక్షకులను మోసం చేయడమే అవుతుందని, తమ సినిమాను కచ్చితంగా థియేటర్లలో విడుదల చేస్తామని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
పూజా హెగ్డే కథానాయికగా... కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్య శ్రీ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన 'రాధే శ్యామ్' సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు. హిందీలో టీ - సిరీస్ నిర్మాణ భాగస్వామి. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందించగా... మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ హిందీలో పాటలకు స్వరాలు అందించారు.