Prasanth Varma: ‘ఆదిపురుష్’ ఎలా ఉన్నా, ‘హనుమాన్’ ఇలాగే ఉంటుంది- ప్రశాంత్ వర్మ
Prasanth Varma: దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‘ మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ వేడుకలో మాట్లాడిన ఆయన ‘ఆదిపురుష్‘ ప్రభావం తమ సినిమాపై ఉండదని వెల్లడించారు.
Prasanth Varma On Adhipurush Movie: చిత్ర పరిశ్రమలో తన మార్క్ టేకింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. సరికొత్త కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా ‘హనుమాన్’. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ఆడియెన్స్ ను పలకరించబోతోంది. సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఏకంగా 11 భాషల్లో విడుదలకాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. అదే సమయంలో ‘ఆదిపురుష్’ ప్రభావం తమ సినిమా మీద ఉండదని వెల్లడించారు.
‘ఆదిపురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు!
వందల కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్న సినిమాల కంటే ‘హనుమాన్’ మూవీ అద్భుతంగా ఉండబోతున్నట్లు ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా బాగా నచ్చిందంటున్నారు. నిజానికి ‘హనుమాన్’ ట్రైలర్ విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ వర్మ మార్క్ టేకింగ్, తేజ సజ్జ యాక్టింగ్, అదిరిపోయే యాక్షన్ సీన్లు అలరిస్తున్నాయి. ‘ఆదిపురుష్’ లాంటి సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ గా మిగిలిన నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ కీలక విషయాలు వెల్లడించారు. ‘ఆదిపురుష్’ సినిమాకు ‘హనుమాన్’ చిత్రానికి ఎలాంటి పోలిక ఉండదన్నారు. ఆ సినిమా ప్రభావం కూడా తమ చిత్రం మీద ఉండదన్నారు. ‘ఆదిపురుష్’ సినిమా వచ్చినా, రాకున్నా ‘హనుమాన్’ సినిమా ఇలాగే ఉంటుందన్నారు.
రాజమౌళి సూచనలు చాలా ప్లస్ అయ్యాయి!
హనుమంతుడి జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథను రాసినట్లు ఆయన వివరించారు. ఈ సినిమాలోని హనుమంతుడి పాత్ర కోసం ఏకంగా ఏడాది పాటు కష్టపడినట్లు చెప్పారు. అందుకే హనుమాన్ పాత్ర అద్భుతంగా వచ్చిందన్నారు. హీరోకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడనేది ఈ సినిమాలో చూపించినట్లు వెల్లడించారు. ఈ మూవీ కథ ఎలాంటి వివాదాలకు కారణం కాదన్నారు. పెద్దవాళ్లకు కథ వినిపించిన తర్వాతే, ఎలాంటి వివాదాలకు చోటు లేదని వారి నుంచి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాతే సినిమా షూరూ చేసినట్లు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యాక దర్శకుడు రాజమౌళిని కలిసినట్లు చెప్పారు. ఆయన ఇచ్చిన సలహాలు ఈ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయన్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2024 జనవరి 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Read Also: రణబీర్ వీడియో TO దీపిక వావ్ - 2023లో బాలీవుడ్ స్టార్స్ టాప్ 10 వైరల్ ఇన్‌స్టా పోస్ట్ లు