105 Minutes Movie Review - వన్ నాట్ ఫైవ్ మినిట్స్ రివ్యూ: హన్సిక విశ్వరూపం - స్టార్టింగ్ టు ఎండింగ్ ఆమెను చూడగలమా?
105 minutes review in Telugu: హన్సికా మోత్వానీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా '105 మినిట్స్'. సినిమా అంతా ఆమె క్యారెక్టర్ ఒక్కటే ఉంటుంది. రిపబ్లిక్ డేకి రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో చూడండి.
Hansika's single character movie 105 minutes review: 'దేశముదురు' సినిమాతో కథానాయికగా పరిచయమై... ఆ తర్వాత 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్', 'దేనికైనా రెడీ', 'పవర్' వంటి హిట్ సినిమాలు చేసిన ఉత్తరాది భామ హన్సిక. తెలుగులో వరుస అవకాశాలు, విజయాలు వచ్చినప్పటికీ... తమిళ చిత్రసీమలో మరిన్ని అవకాశాలు రావడంతో అక్కడ సెటిల్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత హీరోయిన్, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. '105 మినిట్స్' కూడా అటువంటి చిత్రమే.
'105 మినిట్స్' ప్రత్యేకత ఏమిటంటే... సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు స్క్రీన్ మీద సింగిల్ క్యారెక్టర్ కనబడుతుంది. హన్సిక తప్ప మరొకరు ఉండరు. ఈ ప్రయోగాత్మక సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ: చీకటి వేళలో కారులో ఇంటికి వెళుతున్న జాను (హన్సిక)కు విచిత్రమైన ఘటన ఎదురవుతుంది. కళ్ల ముందు... గాలిలో తన నిలువెత్తు రూపం తనకు స్పష్టంగా కనబడుతుంది. క్షణాల్లో మాయం అవుతుంది. దీర్ఘాలోచనలో ఇంటికి వెళుతుంది జాను. సొంతింట్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కంటికి కనిపించని అదృశ్య శక్తి, ఒక ఆత్మ జాను కాలిని ఇనుప గొలుసులతో బంధిస్తుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి జాను విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఆత్మ జానును ఎందుకు టార్గెట్ చేసింది? ఆత్మ నుంచి జాను తప్పించుకుందా? లేదా మరణించిందా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: సినిమా గురించి చెప్పే ముందు 105 అంటే ఏమిటో చెప్పాలి. జస్ట్ అదొక నంబర్ కాదు. హార్డ్ వర్క్ చేస్తూ పాజిటివ్ అంశాలపై ఫోకస్ చేస్తే కలలను సాకారం చేసుకోవచ్చని, లక్ష్యాలు చేరుకుంటామనేది 'యాంగిల్ నంబర్ 105' థియరీ. ఈ సినిమాకు, దానికి సంబంధం ఏమిటి? అంటే... కంటికి కనిపించని శత్రువుతో కథానాయిక పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో విజయం సాధించాలంటే హార్డ్ వర్క్ చేయడంతో పాటు పాజిటివ్ అంశాలపై ఫోకస్ చేయాలన్నమాట. అయితే... ఈ థియరీ గురించి దర్శకుడు సినిమాలో ఎక్కడా వివరించలేదు. కేవలం టైటిల్ పెట్టి ఊరుకున్నారు.
హారర్ థ్రిల్లర్ సినిమాలు ఒక పంథాలో సాగుతాయి. ప్రేక్షకుల్ని భయపెట్టడానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంటారు దర్శక రచయితలు. '105 మినిట్స్' దర్శకుడు రాజు దుస్సా ఆ ట్రిక్స్ ప్లే చేశారు. అయితే... సరైన ముగింపు ఇవ్వలేదు. రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు, '105 మినిట్స్'కు తేడా ఏమిటంటే? ఇందులో స్క్రీన్ మీద హన్సిక మాత్రమే కనిపిస్తారు. ఆమెది కాకుండా మేల్ వాయిస్ వినబడుతుంది. ఒక్క క్యారెక్టర్ ఉన్నప్పుడు సన్నివేశాల్లో క్రిస్పీగా ఉండాలి. రాజు దుస్సా కాస్త సాగదీశారు. ఒక దశలో 'ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది?' అని హన్సిక తనను తాను ప్రశ్నించుకుంటుంది. ప్రేక్షకుడి మదిలో సైతం ఆ ప్రశ్న వస్తుంది.
హారర్ / థ్రిల్లర్స్ సినిమాల్లో ట్విస్టులు ఎక్కువ ఉంటాయి. '105 మినిట్స్'లో హన్సిక పాత్రతో పాటు ట్విస్ట్ కూడా ఒక్కటే. క్లైమాక్స్‌లో బ్యాక్ టు బ్యాక్ రెండు ట్విస్టులు (ఒకటి ఈ కథలోనిది... మరొకటి సీక్వెల్ లీడ్) ఇచ్చారు. అయితే... వాటి కోసం ప్రేక్షకుడు చాలా సేపు వెయిట్ చేయాలి. అంత ఓపిక ప్రేక్షకుడిలో ఉంటుందా? అంటే... సందేహమే. సినిమా ప్రారంభంలో వేర్వేరు ప్రపంచాలు కనిపించినప్పుడు ఆసక్తిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ సేమ్ ట్రిక్ ప్లే చేస్తుంటే బోరింగ్ మొదలవుతుంది. కథ చిన్నది కావడం సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. సాంకేతికంగా సినిమాను ఉన్నంతలో బాగా తీశారు.
రాజు దుస్సా ఎంపిక చేసుకున్న కథలో విషయం ఉంది. కానీ, స్క్రీన్ మీదకు తేవడంలో & స్క్రీన్ ప్లే విషయంలో టైం మరీ ఎక్కువ తీసుకున్నారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ (భూత వర్తమాన భవిష్యత్) కాలాల్లో సన్నివేశాలు చూపించారు. ప్యారలల్ వరల్డ్స్ క్రియేట్ చేశారు. 'అశ్విన్స్' తరహాలో! ప్రయోగాత్మక సినిమా తీసేటప్పుడు... కొత్త విషయం చెప్పేటప్పుడు... ప్రేక్షకుడికి కొంచెమైనా అర్థం అయ్యేలా సన్నివేశాలను తీయాలి. దర్శకుడు సస్పెన్స్ మైంటైన్ చేయడంతో లెంగ్త్ పెరిగింది. నిర్మాణ పరంగా పరిమితులు ఉన్నప్పటికీ... విజువల్ ఎఫెక్ట్స్ బడ్జెట్ పరిమితులకు మించి సూపర్బ్ అవుట్ పుట్ ఇచ్చారు. లొకేషన్స్, బడ్జెట్ తక్కువ. అయినా సినిమాటోగ్రాఫర్ బెటర్ విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ ఓకే. టెక్నికల్ పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. చిన్న సినిమాలకు అవి కామన్ అనుకోవాలి.
Also Read: కెప్టెన్ మిల్లర్ రివ్యూ: ధనుష్, సందీప్ కిషన్‌ల వయలెంట్ సినిమా ఎలా ఉంది?
జాను పాత్రను, సినిమాను తన భుజాల మీద మోశారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే... '105 మినిట్స్'లో విశ్వరూపం చూపించారు. గ్లామర్ ఇమేజ్ నుంచి బయటపడటం కోసం బాగా ప్రయత్నించారు. హన్సికకు సినిమాటోగ్రాఫర్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఆమెను ఎలా చూపిస్తే బావుంటుందో ముందుగా ప్రిపేర్ అయ్యారు. హన్సికకు ప్రెజర్ ఇవ్వకుండా కొన్నిచోట్ల లైటింగ్ ద్వారా మేనేజ్ చేశారు.
'105 మినిట్స్' రెగ్యులర్ ఫిల్మ్ కాదు. హారర్ / థ్రిల్లర్ సినిమాల్లో కొత్త ప్రయత్నం. ఈ తరహా సినిమా చూడాలని థియేటర్లకు వచ్చే టార్గెట్ ఆడియన్స్ తక్కువ. ఒకవేళ వచ్చినా రాజు దుస్సా బ్రిలియన్స్ అర్థం చేసుకుని, కథను గుర్తించడానికి చాలా టైమ్ పడుతుంది. వెయిట్ ఫర్ ఓటీటీ రిలీజ్! ఒకే ఒక్క పాత్రతో సినిమా ఆద్యంతం నడిపించాలని చూసిన దర్శక నిర్మాతల ప్రయత్నాన్ని అభినందించాలి.
Also Read: 'ఫైటర్' రివ్యూ: హృతిక్ రోషన్ సినిమా హిట్టా, ఫట్టా? 'వార్', 'పఠాన్' రేంజ్‌లో ఉందా?