Gruhalakshmi July 11th Update: పాటల పోటీలో గెలిచిన ప్రేమ్, తులసి సంబరం- బోనాల జాతరకి వచ్చిన వసు, సాక్షి
ప్రేమ్ పాటల పోటీలో ఎలాగైనా గెలవకుండా చేయాలని లాస్య ప్లాన్ వేస్తుంది. ప్రేమ్ కి కాకుండా రక్షిత్ కి ఓట్లు వేసి గెలిపించాలని లాస్య, భాగ్య ఆడియన్స్ అందరికీ చెప్తారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ఆడియన్స్ తమ ఫోన్ ద్వారా ఓట్లు వేసి పాటల పోటీలో విజేతలని నిర్ణయిస్తారని యాంకర్ చెప్తుంది. ఇక ఈ పోటీలో ఒక్క ఓటు తేడాతో ప్రేమ్ గెలిచినట్లు నిర్వాహకులు ప్రకటిస్తారు. దీంతో అందరూ చప్పట్లతో అభినందనలు చెప్తారు. అనసూయమ్మ, పరంధామయ్య ఎగిరి గంతెస్తూ సంబరం చేసుకుంటారు. లాస్య కోపంగా నందు ఫోన్ లాక్కోబోతుంటే నేను ప్రేమ్ కి ఓటు వేశానని చెప్తాడు. నేను వద్దు అని చెప్పినా నా మాట అంటే లెక్క లేదా లాస్య అంటుంది. నేను వాడి కన్న తండ్రిని నచ్చని పని చేస్తే కొప్పడతా, నచ్చిన పని చేస్తే నెత్తిన పెట్టుకుంటా వాడు చాలా బాగా పాడాడు అని అందుకే ఓటు వేసానని నందు అంటాడు. నీ ఒక్క ఓటు వల్ల ప్రేమ్ గెలిచాడని లాస్య అసహనంగా ఉంటుంది.
'నేను గాయకుడిగా గుర్తింపు పొందాలని మా అమ్మ ఓపికగా ఎదురు చూసింది. ఇన్నేళ్ళకి మా అమ్మ కల నెరవేరింది. ఇప్పుడు గొప్పగా చెప్పమ్మా నీ కొడుకు గెలిచాడని. నన్ను మా నాన్న నమ్మలేదు దారి తప్పానని వదిలేశాడు. ఈ గెలుపు మా అమ్మకే అంకితం. నా జీవితాన్ని పంచుకుని నా కోపాన్ని భరించి నాకెంతో అండగా నిలిచిందినా భార్య. నా జీవితంలోనే కాదు నా గెలుపులో సగ భాగం కూడా శ్రుతిది థాంక్యూ' అని ఎమోషనల్ అవుతాడు. ఇక పోటీలో గెలిచినందుకు గాను ట్రోఫీ ని తులసికి అందించాలని ప్రేమ్ జడ్జి లను కోరతాడు. తులసి స్టేజ్ మీదకి వెళ్ళి ప్రైజ్ ని అందుకుంటుంది. 'నేను తల్లిగా ఒడిపోయానని ఒక పెద్ద మనిషి నింద వేశారు. ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. కొడుకు పక్కన గర్వంగా తలెత్తుకుని నిలబడటం చూస్తున్నారు. ఈ రోజు తల్లిగా నేను గెలిచాను. నా కొడుకుని గెలిపించుకున్నాను' అని తులసి అంటుంది. ఇక నందు బాధగా నీ గొప్పతనం ఈరోజు తెలుసుకున్నాను కంగ్రాట్స్ రా.. తండ్రిగా నేను ఒడిపోయాను, తల్లిగా మీ అమ్మే గెలిచింది. నిన్ను బాధపెట్టేలా మాట్లాడాను క్షమించు ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని నందు అంటాడు.
Also Read: వసు విషయంలో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్న రిషి, వేగంగా పావులు కదుపుతున్న దేవయాని-సాక్షి
ఇంటికి వచ్చిన నందుని లాస్య మాటలతో దెప్పిపొడుస్తుంది. నా కోపం తులసి మీదే కానీ నా పిల్లల మీద కాదని అంటాడు. ఇక తులసి బొమ్మలతో మాట్లాడుకుంటూ ప్రేమ్ ని బాధపెట్టినందుకు పశ్చాత్తాపడుతుంది. అక్కడికి వచ్చిన అనసూయ, పరంధామయ్య వచ్చి ప్రేమ్ గెలిచేలా చేసినందుకు తులసిని మెచ్చుకుంటారు. ఇక ఆషాడమాసంలో కోడళ్లతో బోనం ఎత్తిస్తానని మొక్కుకున్నానని అనసూయ చెప్తుంది. ఇక కుటుంబం అంతా జాతర దగ్గరకి వెళతారు. అక్కడికి అభి కూడా వస్తాడు. వాళ్ళతో పాటు గుప్పెడంత మనసు సీరియల్ వసుధార, సాక్షి కూడా వస్తారు. రిషి కోసం బోనం ఎత్తుదామని అనుకున్నాను ఈ సాక్షికి ఎలా తెలిసిందని వసు మనసులో అనుకుంటుంది. ఇక వసు, సాక్షి దగ్గరకి తులసి వచ్చి మాట్లాడుతుంది. ఇక బోనం ఎలా చేయాలో తులసి వాళ్లిద్దరికి నేర్పిస్తుంది.