Rashmika Mandanna : రష్మిక కెరీర్ పై 'సికిందర్' దెబ్బ... సల్మాన్ డిజాస్టర్ మూవీతో క్రేజీ ప్రాజెక్ట్ చేజారిందా?
Rashmika Mandanna : బాలీవుడ్ వర్గాల సమాచారం 'సికందర్' సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ తో రష్మిక మందన్న చేతి నుంచి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేజారిందని సమాచారం. మరి రష్మిక మిస్ చేసుకున్న ఆ బడా ప్రాజెక్ట్ ఏంటంటే?

వరుసగా పాన్ ఇండియా హిట్స్ తో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోష్ కి 'సికందర్' డిజాస్టర్ స్పీడ్ బ్రేక్ వేసింది. ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఎఫెక్ట్ హీరోయిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పడిందని తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ మరేమిటో కాదు 'స్పిరిట్'. నిజానికి ఈ మూవీలో ఆమె హీరోయిన్ అన్న విషయం ఇంకా కన్ఫామ్ కాలేదు. అంతలోపే రష్మికను 'స్పిరిట్' నుంచి పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది.
రష్మిక కెరీర్ పై 'సికందర్' డిజాస్టర్ ఎఫెక్ట్
రెండేళ్లలోపే 'యానిమల్', 'పుష్ప 2', 'ఛావ' వంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌లను రష్మిక మందన్న తన ఖాతాలో వేసుకుంది. ఈ దెబ్బతో ఆమెను లక్కీ ఛార్మ్ గా భావించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెకు దక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెకు మేకర్స్ 4 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని అన్నారు. కానీ సల్మాన్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన 'సికందర్' కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయ్యాక, 'స్పిరిట్'లో ఇకపై రష్మిక భాగం కాబోదని వార్తలు వచ్చాయి. కానీ అసలు ఇప్పటిదాకా రష్మిక 'స్పిరిట్'లో హీరోయిన్ గా నటిస్తుంది అన్న విషయమే అధికారికంగా నిర్ధారణ కాలేదు. అలాగే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు అని వస్తున్న వార్తలపై కూడా అఫిషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు చిత్రబృందం. నిర్మాతల నుంచి ఈ విషయమై క్లారిటీ వచ్చేదాకా ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. ఇక రష్మిక డేట్స్ జూన్ నుండి అవైలబుల్ గా ఉంటాయని సమాచారం. మరోవైపు 'స్పిరిట్'లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నెగటివ్ రోల్స్ పోషించే అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి.
రష్మిక అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు
రష్మిక మందన్న ఏప్రిల్ 5న ఒమన్‌లోని సలాలా నగరంలో బీచ్ ఒడ్డున తన 29వ పుట్టినరోజును జరుపుకుంది. తీరిక లేని షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న ఆమె బర్త్ డే సందర్భంగా వెకేషన్ కు వెళ్ళి చిన్న విరామం తీసుకుంది. తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుందని రూమర్లు వచ్చాయి. కానీ ఈ జంట ఈసారి కూడా తమ రిలేషన్షిప్ పై వస్తున్న వార్తల గురించి స్పందించలేదు. కానీ రష్మిక మందన్న పెట్టుకున్న రింగ్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా, రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం రెండు బడా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న 'కుబేర'లో ఆమె హీరోయిన్ గా కన్పించనుంది. అలాగే ఆమె ఖాతాలో ఉన్న మరో ప్రాజెక్ట్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేస్తున్న 'థామ'. మరోవైపు 'గర్ల్ ఫ్రెండ్' అనే మూవీ కూడా చేస్తోంది. వీటి తరువాత రష్మిక నెక్స్ట్ మూవీ ఏంటి ఆన్నది తెలియాల్సి ఉంది.





















