Vishwambhara First Single: మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చే అప్డేట్... ఆ గుడిలో 'విశ్వంభర' ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్
Viswambhara : చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం. మెగా సెంటిమెంట్ ప్రకారం ఆ సాంగ్ ను ఓ గుడిలో రిలీజ్ చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర'. 'బింబిసారా' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం మెగా అభిమానులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎగిరి గంతేసే అప్డేట్ ఒకటి వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారనేది తాజా సమాచారం. అయితే ఈ సాంగ్ ను మెగా సెటిమెంట్ ను అప్లై చేయబోతున్నారు. నందిగామలోని ప్రముఖ దేవాలయంలో హనుమాన్ విగ్రహం దగ్గర రిలీజ్ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే సినిమాలో కూడా హనుమాన్ విగ్రహం దగ్గర కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించారు.
ఫస్ట్ సింగిల్ కు మెగా సెంటిమెంట్
మెగా ఫ్యామిలీ మొత్తం హనుమాన్ కు వీరాభిమానులు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆంజనేయ స్వామిపై తమ భక్తిని బయట పెట్టుకుంటారు. మెగాస్టార్ ఏకంగా ఆయనే పేరు చిరంజీవినే తన నామధేయంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ హనుమాన్ మాల కూడా వేశారు. మెగా వారసుడు రామ్ చరణ్ కూడా మాల వేస్తారు. అలాగే నిన్నటికి నిన్న బుచ్చిబాబుకు హనుమాన్ విగ్రహంతో పాటు రామ పాదాలను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ నేపథ్యంలో హనుమాన్ సెంటిమెంట్ ను 'విశ్వంభర' మూవీ విషయంలోనూ ఫాలో అవుతున్నారు. అందుకే నందిగామలో ఉన్న హనుమాన్ విగ్రహం దగ్గర చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయాలని డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది.
రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్
సోషియో ఫాంటసీ జానర్ లో రూపొందుతున్న 'విశ్వంభర' మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సి ఉంది. కానీ వాయిదా పడడంతో కొత్త రిలీజ్ డేట్ గురించి చర్చ మొదలైంది. మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ మూవీకి మేకర్స్ రెండు రిలీజ్ డేట్లు అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి మే 9. సమ్మర్ హాలీడేస్ లో బాస్ బాక్స్ ఆఫీసు ఎంట్రీకి సిద్ధం అవుతున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేస్తే... ఆ స్పెషల్ డే రోజు దుమ్మురేపే కలెక్షన్స్ తో మరింత స్పెషల్ అవుతుందని అంచనా వేస్తున్నారట. మరి ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారా? అనే ఆసక్తి నెలకొంది. అలాగే టీజర్ రిలీజ్ టైమ్ లో జరిగిన ట్రోలింగ్ కు ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారో చూడాలి.
మెగాస్టార్ వింటేజ్ క్రేజ్ ను ఈ మూవీ ద్వారా తీసుకొస్తామని నిర్మాతలు చెబుతున్నారు. దాని కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో దాదాపు దశాబ్దం తరువాత త్రిష మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, కునాల్ కపూర్, జాన్వీ కపూర్ వంటి ఐదుగురు యంగ్ హీరోయిన్లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.





















