Harish Shankar: మిస్టర్ బచ్చన్ తేడా ఎఫెక్ట్... రెమ్యూనరేషన్ వెనక్కిచ్చిన హరీష్ శంకర్
Mr Bachchan Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కించిన 'మిస్టర్ బచ్చన్' డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రావడంతో హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్‌లో కొంత వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది.
దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar)ది ముక్కుసూటి వ్యవహారం. ఆయన దగ్గర నో ఫిల్టర్స్. మనసులో ఉన్నది మాట్లాడతారు. అందర్ బహార్ టైప్ కాదు. ఒకటి చెప్పి మరొకటి చేయడం ఉండదు. 'మిస్టర్ బచ్చన్' రిజల్ట్ విషయంలో నిర్మాతకు చెప్పినట్టు తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన హరీష్ శంకర్!
Harish Shankar Remuneration: 'మిస్టర్ బచ్చన్' సినిమాకు హరీష్ శంకర్ ఎంత తీసుకున్నారు అనేది బయటకు రాలేదు. హీరోలు, దర్శకులు లేదా సినిమాకు పని చేసిన వ్యక్తులకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారనేది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బయటకు చెప్పదు. 'బ్రో' సినిమా సమయంలో పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే... అది పవన్ - తమకు మధ్య వ్యవహారం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. ఇప్పుడూ అదే సమాధానం చెప్పొచ్చు.
హరీష్ శంకర్ రెమ్యూనరేషన్ ఎంత అనేది పక్కన పెడితే... 'మిస్టర్ బచ్చన్' ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రావడంతో కొంత భర్తీ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. రెండు కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చారని తెలిసింది. డిస్ట్రిబ్యూషన్ వల్ల నష్టపోయిన వాళ్లకు ఆ డబ్బులు ఇవ్వమని నిర్మాతను రిక్వెస్ట్ చేశారట. మరో నాలుగు కోట్ల రూపాయలు ఇస్తానని నిర్మాతకు ప్రామిస్ చేశారట. అయితే, ఆ డబ్బులను తాను చేయబోయే తర్వాత సినిమాకు కట్ చేసుకోమని చెప్పారట.
హరీష్ మీద విమర్శలు... లేదన్న నిర్మాత'మిస్టర్ బచ్చన్'
సినిమా కంటే విడుదల సమయంలో హరీష్ శంకర్ వ్యవహార శైలి చర్చనీయాంశం అయ్యింది. నిర్మొహమాటంగా మాట్లాడే ఆయన తీరు సినిమాకు చేటు చేసిందని, ఎక్కువ ఫ్లాప్ టాక్ వచ్చేలా చేసిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫీల్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అటువంటిది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు తానుగా నష్టాలు భరించడానికి హరీష్ శంకర్ ముందుకు వచ్చారని, డబ్బులు వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్టు విశ్వ ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ హరీష్ శంకర్ 2 కోట్లు ఇచ్చారు.
అజయ్ దేవగన్ హీరోగా నటించిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'రెయిడ్' ఆధారంగా ఈ 'మిస్టర్ బచ్చన్' సినిమా తీశారు దర్శకుడు హరీష్ శంకర్. అయితే... కథలో పలు మార్పులు, చేర్పులు చేశారు. హీరోకి సపరేట్ లవ్ ట్రాక్ రాశారు. కమర్షియల్ సాంగ్స్ యాడ్ చేశారు. ఆ మార్పులు కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చలేదు. సినిమాకు ప్రీమియర్ షోస్ నుంచి మిక్స్డ్ టాక్ లభించింది.
మాస్ మహారాజా రవితేజకు జోడీగా భాగ్య శ్రీ బోర్సే నటించిన 'మిస్టర్ బచ్చన్'లో జగపతి బాబు విలన్ రోల్ చేశారు. సత్య, 'చమ్మక్' చంద్ర, ప్రవీణ్, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.