Upcoming Movies July 1st Week: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్
Upcoming Movies Web Series In July 1st Week 2022: థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు ఏవి? ఓటీటీల్లోకి వస్తున్న వెబ్ సిరీస్‌లు ఏవి? ఓ లుక్ వేయండి.
'పక్కా కమర్షియల్' అంటూ థియేటర్లలోకి వినోదం పంచడానికి మ్యాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు మారుతి వస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగునాట థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు ఏవి? ఓటీటీలో ఏయే వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. ఏయే సినిమాలు విడుదలవుతున్నాయి? అనే వివరాల్లోకి వెళితే...
ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్... పక్కా కమర్షియల్
గోపీచంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వం వహించిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఇందులో రాశీ ఖన్నా కథానాయిక. గోపీచంద్ లాయర్ రోల్ చేశారు. ఆయన తండ్రిగా సత్యరాజ్, విలన్ పాత్రలో రావు రమేష్ నటించారు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సినిమాపై మంచి హైప్ వచ్చింది. తెలుగులో ఈ వారం వస్తున్న పెద్ద చిత్రమిదే. టికెట్ రేట్స్ తగ్గించడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం.
ఏనుగు... అరుణ్ విజయ్ మాస్!
తమిళ దర్శకుడు హరి పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు 'సింగం' సిరీస్ గుర్తుకు వస్తుంది. ఆయన తెరకెక్కించిన తాజా సినిమా 'ఏనుగు'. ఇందులో 'బ్రూస్ లీ', 'సాహో' సినిమాల్లో నటించిన అరుణ్ విజయ్ హీరో. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే... హరి మాస్ కనపడుతోంది. సినిమా ఎలా ఉంటుందో థియేటర్లలో చూడాలి.
'టెన్త్ క్లాస్ డైరీస్'... అవికా గోర్ సినిమా!
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. దీంతో సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు 'వెన్నెల' రామారావు పదో తరగతి బృందంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సినిమా నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు.
మాధవన్ 'రాకెట్రీ' కూడా!
నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' కూడా జూలై 1న విడుదల కానుంది. అయితే... జూన్ 30న విడుదలకు సిద్ధమైన పృథ్వీరాజ్ సుకుమారన్ 'కడువా' సినిమా అనివార్య కారణాల వల్ల వారం వాయిదా పడింది.
జూలై 1న మరో రెండు సినిమాలు కూడా థియేటర్లలో విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి 'కబాలి'లో రజనీకాంత్ కుమార్తెగా నటించిన ధన్సిక 'షికారు'. మరొకటి... 'వంగవీటి' ఫేమ్ సందీప్ నటించిన 'గంధర్వ'.
ఓటీటీలో బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్:
జూలై 1న ఓటీటీ వేదికల్లో విడుదల కానున్న సినిమాలు చూస్తే... థియేటర్ల దగ్గర డిజాస్టర్లు అనిపించుకున్న రెండు సినిమాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్ జంటగా నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' జూలై 1న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది. కంగనా రనౌత్ 'ధాకడ్' జీ 5 ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.
రెజీనా వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్' కూడా జూలై 1నే!
రెజీనా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అన్యాస్ ట్యుటోరియల్'. తెలుగు, తమిళ భాషల్లో జూలై 1న విడుదల కానుంది. హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ట్రైలర్ చూస్తే... ఒక ఇంట్లో జరిగే సినిమా అనిపించినా గ్రిప్పింగ్ గా ఉంది. తెలుగులో ఈ వారం విడుదలకు సిద్ధమైన చెప్పుకోదగ్గ సిరీస్ ఇదే.
Also Read : అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ. 2355 కోట్లు ఇస్తామంటున్నారు
ఓటీటీల్లో విడుదల కానున్న మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు:
- జూన్ 30 నుంచి వూట్ ఓటీటీ వేదికలో కన్నడ సినిమా 'డియర్ విక్రమ్' విడుదల కానుంది.
- జీ 5లో 'షటప్ సోనియా' అని ఒక డాక్యుమెంటరీ విడుదల కానుంది. 2019లో అది వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
- అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో జూలై 1న 'ది టెర్మినల్ లిస్ట్' రిలీజ్ అవుతోంది. ఇదొక వెబ్ సిరీస్. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది.
- జూలై 1 నుంచి ఆహా ఓటీటీ వేదికలో 'బాల భారతం' అని ఒక యానిమేషన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. జూలై 1న ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో క్రైమ్ అండ్ కామెడీ సిరీస్ 'మియా బీవీ ఔర్ మర్డర్' విడుదలకు రెడీ అయ్యింది.
- జూలై 3న హిందీ సినిమా 'ఆపరేషన్ రోమియో' నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది.
Also Read : ప్రియాంకతో ఉన్నది బాయ్‌ఫ్రెండేనా - అమ్మ అడగడంతో అసలు విషయం చెప్పిన హీరోయిన్