Praveen Sattaru: కావాలంటే వారిని పిలుస్తా, జర్నలిస్టుకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కౌంటర్!
అడ్డగోలు ప్రశ్నలతో విసిగించిన ఓ జర్నలిస్టుపై దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే తన గత సినిమాల నిర్మాతలను పిలుస్తానని, వారితో మాట్లాడి అసలు విషయాలు తెలుసుకోవాలని సూచించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ సాక్షి వైద్య నటించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. ఆగష్టు 25న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఫర్వాలేదు అంటున్నారు. వరుణ్ తేజ్ లాస్ట్ సినిమా 'గని'తో పోల్చితే చాలా బాగుంది అంటున్నారు.
జర్నలిస్టుకు ప్రవీణ్ సత్తారు కౌంటర్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు దర్శకడు ప్రవీన్ సత్తారు. ఈ సందర్భంగా తనను ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడిగిన జర్నలిస్టుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిరాధారమైన, ఊహాగానాలను తన దగ్గర ప్రస్తావించడం పట్ల ఆయన కోప్పడ్డారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గత సినిమాల నిర్మాతలతో విభేదాలు ఏర్పడ్డాయనే వార్తల్లో నిజం ఎంత? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించాడు. దీనిపై ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని చెప్పారు. కావాలంటే తాను తెరకెక్కించిన గత చిత్రాల నిర్మాతలను పిలుస్తానని, వారినే అడిగి అసలు విషయాలు తెలుసుకోవాలని సూచించారు. మీడియా అంటే తనకు గౌరవం ఉందని, వాస్తవానికి దూరంగా ఉన్న ప్రశ్నలు అడగకపోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
లండన్‌లో వారం రోజుల పాటు జరిగే కథ
ఇక ప్రవీణ్ సినిమాలు చాలా వరకు హాలీవుడ్ సినిమాల మాదిరిగానే ఉంటాయి. హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఆయన మీద ఎక్కువగా ఉందనే భావన అందరిలో ఉంది. ఆయన సినిమాలు యాక్షన్ తో నిండిపోయి ఉంటాయి. అలాంటి ప్రయత్నంలో భాగంగానే తాజాగా వరుణ్ తేజ్ తో కలిసి 'గాండీవధారి అర్జున' సినిమా తెరకెక్కించారు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. సినిమా కథ, అతని మేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంది. తాజాగా ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు ప్రవీణ్ సత్తారు. ‘‘లండన్‌లో వారం రోజుల పాటు జరిగే కథ ఇది. అక్కడ జరిగే శిఖరాగ్ర సమావేశానికి భారత్ తరపున నాజర్ హాజరవుతారు. హీరో తన భద్రత కోసం ఒక ఏజెన్సీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పంపబడతాడు. అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనేది సినిమా కథ. ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కడ తీశారు అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కేవలం కథకు మాత్రమే కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి” అని వివరించారు.
Read Also: నేషనల్ ఫిల్మ్ అవార్డు విజేతలకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసా? బన్నీకి ఏమిస్తారు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial