Dhanush 50th Movie: ధనుష్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ రెడీ - శేఖర్ కమ్ముల మూవీ కాదండోయ్!
D50: ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి, నటించిన ‘D50 ’ ఫస్ట్‌లుక్ సోమవారం విడుదల కానుంది.
Dhanush: ప్రస్తుతం మనదేశంలో ఉన్న వెర్సటైల్ యాక్టర్లలో తమిళ స్టార్ హీరో ధనుష్ ముందంజలో ఉంటారు. కమర్షియల్ సినిమాలతో పాటు కొత్త తరహా సినిమాలతో కూడా ధనుష్ ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా అనేక ఇతర భాషల్లో కూడా ధనుష్ సినిమాలు చేశారు. హిట్లు కూడా కొట్టారు. ఏకంగా హాలీవుడ్‌లో కూడా ధనుష్ సినిమా చేశారు. ధనుష్ కేవలం నటుడు మాత్రమే కాదు. తన ప్రతి సినిమాలో ధనుష్ కనీసం ఒక్క పాట అయినా పాడతారు. సినిమాలు కథలు కూడా రాస్తారు. అంతే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తారు. 2017లో వెటరన్ నటుడు రాజ్ తరుణ్ హీరోగా ‘పవర్ పాండీ’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కూడా అయింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ధనుష్ రెండో సినిమా దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.
హీరో కూడా...
ధనుష్ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమాలో హీరోగా కూడా ఆయనే నటిస్తున్నారు. ఇది హీరోగా ఆయనకు 50వ సినిమా కావడం విశేషం. గతేడాది జులైలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించి చకచకా డిసెంబర్ కల్లా పూర్తి చేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. క్యాస్టింగ్ పరంగా కూడా చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఇది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే నిత్య మీనన్, అపర్ణ బాల మురళి, కాళిదాస్ జయరామ్, అనిఖా సురేంద్రన్, సెల్వ రాఘవన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఈ సినిమా టెక్నికల్ క్రూ డిటైల్స్ కూడా ఇంకా రివీల్ చేయలేదు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ ప్రెస్టీజియస్ సినిమాను నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సినిమా స్కేల్ చాలా పెద్దగా ఉండనుందని, రా అండ్ రస్టిక్‌గా ధనుష్ ఈ సినిమా పిక్చరైజ్ చేసినట్లు సమాచారం. మరి ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
టైటిల్ అదేనా...
ఈ సినిమాకు ‘రాయన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా వచ్చే దాకా ఆగాల్సిందే. ఇండస్ట్రీలో అసలు గ్యాప్ తీసుకోకుండా పని చేసే హీరోల్లో ధనుష్ ముందంజలో ఉంటారు. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటించిన వెంటనే రెండు రోజుల వ్యవధిలోనే మూడో సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించాడు. పూర్తిగా యంగ్ టాలెంట్‌తో ‘నిలవుకు ఎన్‌మేల్ ఎన్నడీ కోబం’ అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా ధనుషే కావడం విశేషం.
ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామానే అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఏప్రిల్ నుంచి తమిళ దర్శకుడు హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని తెలుస్తోంది. ఇలా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బిజీగా దూసుకుపోతున్నారు ధనుష్.