Agent Movie: అఖిల్ 'ఏజెంట్' సినిమా - ఇప్పట్లో కష్టమే!
తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు అఖిల్.
అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత సక్సెస్ కోసం చాలా పరితపించారు. కానీ ఆయన నటించిన సినిమాలన్నీ ఏవరేజ్ గా ఆడాయి. ఎట్టకేలకు తన నాల్గో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇంతకాలానికి హిట్ దక్కడంతో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఈ యంగ్ హీరో.
తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దానికి తగ్గట్లే కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేశారు.
కానీ సినిమా వాయిదా పడింది.
డిసెంబర్ లో సినిమా రిలీజ్ కావడం పక్కా అని వార్తలొచ్చాయి. కానీ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. అటు హీరో నుంచి కానీ ఇటు చిత్రబృందం కానీ దీనిపై స్పందించడం లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 'ఏజెంట్' సినిమా ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేనట్లే. 2023 జనవరిలో సినిమా రిలీజ్ చేద్దామని నిర్మాత ఆలోచిస్తున్నారు. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే కొన్ని భారీ బడ్జెట్ సినిమాలున్నాయి.
వాటితో పోటీ పడితే థియేటర్లు దొరకడం కష్టమవుతుంది. కాబట్టి రిపబ్లిక్ డేకు వెళ్లడం తప్ప మరో ఆప్షన్ ఉండకపోవచ్చు. కాకపోతే ఆ సమయానికి షారుఖ్ ఖాన్ 'పఠాన్' రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఎఫెక్ట్ చూపనప్పటికీ.. 'ఏజెంట్' సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి.. హిందీలో 'పఠాన్' సినిమా డామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ డేట్ ను కూడా వదులుకుంటే ఇక మళ్లీ వేసవికే రావాల్సి ఉంటుంది. మరేం చేస్తారో చూడాలి.
ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్‌లో అఖిల్ జోడీగా సాక్షి వైద్య నటిస్తుంది. ఈ సినిమా మలయాళ నటుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
వేణుశ్రీరామ్ తో అఖిల్:
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా 'వకీల్ సాబ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. ఆ సినిమాకు 'తమ్ముడు' టైటిల్ పరిశీలనలో ఉందట. సినిమాలో పవన్ 'తమ్ముడు' రిఫరెన్స్ ఉంటుందో? లేదో? గానీ... ఈ టైటిల్ మాత్రం పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది పవన్ కళ్యాణ్ టైటిల్స్ వాడుకున్నారు. ఈ విషయంలో కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. మరి అఖిల్ సినిమాకి కూడా పవన్ టైటిల్ వాడితే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!
Also Read : మళ్ళీ ట్రోల్స్ మొదలు - విష్ణు మంచుపై 'జిన్నా' విడుదలకు ముందు ఎందుకిలా?