Captain Miller: ‘కెప్టెన్ మిల్లర్’పై కాపీ రైట్స్ కేసు - సంచలన నిజాలు బయటపెట్టిన నటుడు!
Captain Miller: ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సంక్రాంతి కానుకగా విడుదలయ్యి ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంతలోనే ఇది నవల నుండి కాపీ కొట్టిన కథ అని ఒక నటుడు ఆరోపించాడు.
Captain Miller: సంక్రాంతిలో తెలుగులోలాగానే తమిళంలో కూడా సినిమాల సందడి జోరుగా సాగింది. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’, శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అయాలన్’ విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా కలెక్షన్స్ సాధించి.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్‌గా నిలిచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కెప్టెన్ మిల్లర్’.. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతుండగా.. ఇంతలోనే ఈ మూవీకి ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. సినిమాను కాపీ కొట్టారంటూ రైటర్ కమ్ డైరెక్టర్ అయిన వేల రామమూర్తి ఆరోపించారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
నవల నుండి కాపీ..
అరుణ్ మాథేశ్వరం దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లరే ‘కెప్టెన్ మిల్లర్’. ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి ట్రైలర్ వరకు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. ఇంతలోనే ఈ మూవీ చుట్టూ కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. కోలీవుడ్ సీనియర్ నటుడు వేల రామమూర్తి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ‘కెప్టెన్ మిల్లర్’ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను రచించిన ‘పట్టత్తు యానయ్’ అనే నవల ఆధారంగా ‘కెప్టెన్ మిల్లర్’ను తెరకెక్కించారని ఆరోపించారు రామమూర్తి.
ఆయన సాయం చేస్తారు..
తన అనుమతి లేకుండానే తన నవల ‘పట్టత్తు యానయ్’ను కాపీ కొట్టి ‘కెప్టెన్ మిల్లర్’ను తెరకెక్కించారని వేల రామమూర్తి ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. త్వరలోనే డైరెక్టర్స్ యూనియన్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేస్తానన్నారు. కాపీ కొట్టడమే కాకుండా మూవీ టీమ్.. ఈ విషయం తన అనుమతి కూడా అడగలేదని రామమూర్తి సీరియస్ అయ్యారు. ‘‘నాకు న్యాయం కావాలి. సినీ పరిశ్రమలో నిజాయితీ అనేది లేదు. భారతీరాజా నాకు సాయం చేస్తారనే నమ్మకంతో నేను సినిమా డైరెక్టర్స్ యూనియన్‌ను ఆశ్రయించనున్నాను’’ అని తెలిపారు. ప్రస్తుతం సీనియర్ దర్శకుడు భారతీరాజా.. డైరెక్టర్స్ యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అందుకే ఆయనను కలవడానికి రామమూర్తి సన్నాహాలు చేస్తున్నారు.
డబ్బు, ఫేమ్ అవసరం లేదు..
తను డబ్బు కోసమో, ఫేమ్ కోసమో ‘కెప్టెన్ మిల్లర్’ టీమ్‌పై నిందలు వేయడం లేదని వేల రామమూర్తి క్లారిటీ ఇచ్చారు. తను డబ్బు, ఫేమ్‌ను ఇప్పటికే అనుభవించానని తెలిపారు. ప్రాపర్టీ రైట్స్ గురించి గుర్తుచేస్తూ.. తను చేసిన పనికి తనకు న్యాయం కావాలని కోరారు రామమూర్తి. దీంతో అసలు రామమూర్తి చెప్పింది నిజమా, కాదా అని తెలుసుకోవడానికి కోలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘కెప్టెన్ మిల్లర్’ టీమ్ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అరుణ్ మాథేశ్వరం తెరకెక్కించిన ఈ మూవీలో ధనుష్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ఎలంగో కుమారవేల్‌లాంటి నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం.. సినిమాకు ప్లస్ అయ్యింది.
Also Read: ఆస్పత్రిలో చేరిన సైఫ్ అలీఖాన్ - 'దేవర' షూటింగ్‌లో గాయాలు..