Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?
రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఎంతనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
ఇండియన్ సినిమాలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కుతోంది. మన ఫిలిం మేకర్స్ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ స్థాయిలో హలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అవి వరల్డ్ బాక్సాఫీసు దగ్గర భారీ కలెక్షన్స్ సాధిస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దంగల్, బాహుబలి-2, RRR, KGF-2, పఠాన్ వంటి 5 భారతీయ చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్ కాబోతున్న 'ఆదిపురుష్' చిత్రానికి ఈ లిస్టులో చేరడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
2016లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన 'దంగల్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2024 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇది డొమెస్టిక్ మార్కెట్ లో కంటే ఓవర్ సీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించడం గమనార్హం. ఇదే క్రమంలో 2017లో వచ్చిన 'బాహుబలి 2' సినిమా 2500 కోట్ల వసూళ్లతో రికార్డులు తిరగరాసింది. భారతీయ సర్క్యూట్స్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో 'బాహుబలి - ది కన్క్లూజన్' మూవీ రూపొందింది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన RRR సినిమా సైతం వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. 2022 మార్చిలో రిలీజైన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా, వరల్డ్ వైడ్ గా 1250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జపాన్ బాక్సాఫీసు కలెక్షన్స్ తో గతేడాది వచ్చిన సినిమాలలో టాప్ లో నిలిచింది. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వరించడం కూడా ఈ సినిమా విజయానికి దోహద పడింది.
అలానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా నటించిన 'KGF 2' మూవీ కూడా 1200 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇక వెయ్యి కోట్ల క్లబ్ లో చివరగా చేరిన భారతీయ చిత్రం 'పఠాన్'. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. టాక్ తో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1050 కోట్లు రాబట్టింది. అయితే ఇప్పుడు 'ఆదిపురుష్' కి ఈ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం ఇతిహాసం ఆధారంగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో టీ-సిరీస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. జూన్ 16న భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. UV క్రియేషన్స్ & పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.
నిజానికి ‘ఆదిపురుష్’ టీజర్ కు వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్ చూసి, బాక్సాఫీసు ఫలితం ఎలా ఉంటుందో అని అందరూ కంగారు పడ్డారు. అయితే ట్రెయిలర్ మరియు సాంగ్స్ వచ్చిన తర్వాత పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. వీఎఫెక్స్ కరెక్షన్ల తర్వాత సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇదొక మోషన్ క్యాప్చర్ పిక్చర్ అని మేకర్స్ ఆడియెన్స్ ను ముందుగానే ప్రిపేర్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇదంతా ప్రభాస్ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడానికి దోహదం చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అందులోనూ బరిలో మరో పెద్ద సినిమా ఏదీ లేకపోవడం ‘ఆదిపురుష్’ కు కలిసొస్తుందని అభిప్రాయ పడుతున్నారు. రామాయణం కథ అందరికీ తెలిసిందే అయినప్పటికీ, తన్హాజీ దర్శకుడు 3డీ టెక్నాలజీలో మ్యాజిక్ క్రియేట్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం గ్యారంటీ అని అంటున్నారు. ఇది కచ్ఛితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని డార్లింగ్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
కాగా, ‘ఆదిపురుష్’ సినిమాలో శ్రీ రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ కనిపించనున్నారు. లంకేశ్ పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించారు.