Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!
వెరైటీ కాన్సెప్టులతో యూత్ ను అట్రాక్ట్ చేస్తున్న హీరో విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన 'దాస్ కా ధమ్కీ' మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ మూవీ ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిగా మూవీగా నిలిచింది.
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా, యువతకు నచ్చేలా రీసెంట్ డేస్ లో వరుస సినిమాలతో బిజీగా మారిన యువ హీరో విశ్వక్ సేన్. విశ్వక్ సొంత నిర్మాణ, దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా.. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22న విడుదలైన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'దాస్ కా ధమ్కీ' తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. యూఎస్ వంటి విదేశాల్లోనూ ఓ ఊపు ఊపేస్తోంది. ముందు నుంచీ భారీ హైప్ ను క్రియేట్ చేసిన ఈ సినిమాకు.. అంతే స్థాయిలో ప్రమోషన్స్ చేయడం ప్లస్ పాయింట్ గా మారింది. ఈ మూవీపై ప్రారంభంలో నెగెటివ్ టాక్ వచ్చినా.. లాంగ్ రన్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతే కాదు విశ్వక్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటిలో కంటే ఈ మూవీ అత్యంత ఎక్కువ వసూళ్లను రాబట్టడం విశేషం.
విశ్వక్ కెరీర్ లోనే 'దాస్ కా ధమ్కీ' ది బెస్ట్ మూవీగా నిలిచింది. అంతకుముందు తీసిన ‘పాగల్’ సినిమాకు కూడా భారీ కలెక్షన్లు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో హిట్ ను అందుకోలేదు. కానీ 'దాస్ కా ధమ్కీ'కి విడుదల తేదీ నుంచే మంచి కలెక్షన్లు రావడం విశ్వక్ కెరీర్ కు ప్లస్ గా మారింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లోనే యునైటైడ్ స్టేట్స్ లో భారీ వసూళ్లు రాబట్టి.. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. విశ్వక్ సేన్ యొక్క మునుపు తీసిన చిత్రాలు మొత్తం లాంగ్ రన్‌లో కలిపి 2 లక్షల డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేయనప్పటికీ, 'దాస్ కా ధమ్కీ' మొదటి వారంలోనే 3లక్షల డాలర్ల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. ఫలితంగా, ఇది USAలో విశ్వక్ సేన్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్-ఈవెన్ వెంచర్.
'దాస్ కా ధమ్కీ' చూసిన ప్రతి ఒక్కరూ విశ్వక్ సేన్ నటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. కథ అంతా రొటీన్ గా సాగినా.. విశ్వక్ క్యారెక్టర్ అందర్నీ మెప్పించింది. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని డిజైన్ చేయడంలో విశ్వక్ విఫలమయ్యాడని కొన్నిచోట్ల టాక్ కూడా వినిపించింది. ఇంకాస్త కసరత్తు .. స్క్రీన్ ప్లే పై మరింత దృష్టి పెట్టి ఉంటే, రెండు పాత్రల బాడీ లాంగ్వేజ్ ను డిఫరెంట్ గా డిజైన్ చేసి ఉంటే, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదనే టాక్ వినిపిస్తోంది.
ఇక ముందు నుంచే 'దాస్ కా ధమ్కీ' చిత్రంపై నటుడు విశ్వక్ సేన్ భారీ హైప్ క్రియేట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. దీంతో విశ్వక్ ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తాడా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు కాస్త నిరాశే మిగిలిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో నటులు రావు రమేశ్, పృథ్వీరాజ్, హైపర్ ఆది నటించగా... ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విష్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.
Also Read: వేసవిలో వినోదం - సమ్మర్‌లో సందడి చేయనున్న సినిమాలివే, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికీ?