Virat Kohli: తెలుగు హీరోల్లో అతడే నా బెస్ట్ ఫ్రెండ్ - విరాట్ కోహ్లీ
Virat Kohli: విరాట్ కోహ్లీకి బాలీవుడ్ హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ తను తెలుగు హీరోలను కలిసింది చాలా తక్కువసార్లు మాత్రమే. తాజాగా తెలుగు హీరోల్లో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో బయటపెట్టాడు కోహ్లీ.
Virat Kohli: స్పోర్ట్స్, సినిమా.. ఇవి రెండే ఎక్కువమందిని ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అలాగే సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉంటారు. తరచుగా పార్టీల్లో కలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇండియన్ మెన్ క్రికెట్ టీమ్‌లో అత్యధిక ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ పేరు ముందుంటుంది. తన భార్య అనుష్క శర్మ ఒక బాలీవుడ్ నటి కావడంతో విరాట్ కోహ్లీకి బాలీవుడ్ సెలబ్రిటీలతో మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ టాలీవుడ్ స్టార్లను తను కలిసిన సందర్భాలు చాలా తక్కువ. అయినా కూడా టాలీవుడ్ హీరోల్లో తన ఫేవరెట్ ఎవరు అని తాజాగా బయటపెట్టాడు విరాట్ కోహ్లీ.
ప్రజల్లో అవగాహన కోసం..
విరాట్ కోహ్లీ ఎక్కువశాతం తన క్రికెట్ టోర్నమెంట్స్‌లో బిజీగా ఉన్నా ప్రజలకు సాయం చేసే విషయంలో, వారికి అవగాహన కల్పించే విషయంలో కూడా ముందుంటాడు. అందులో భాగంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎంత ప్రమాదకరం అని ప్రజలకు చెప్పడం కోసం ‘రోడ్ అండ్ ఆల్కహాల్ అవేర్నెస్ ప్రోగ్రామ్’లో పాల్గోనున్నాడు కోహ్లీ. ఆ కార్యక్రమంలో విరాట్ కోహ్లీతో పాటు ఎన్‌టీఆర్ కూడా పాల్గోనున్నాడు. వీరిద్దరూ కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాలు ఏంటి, దానికి ఎందుకు దూరంగా ఉండాలి అని ప్రజల్లో అవగాహన కల్పించడానికి ముందుకొచ్చారు. అంతే కాకుండా ఈ ప్రోగ్రామ్‌కు వీరే బ్రాండ్ అంబాసిడర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
నేను కూడా స్టెప్పేశాను..
ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎన్‌టీఆర్, విరాట్ కోహ్లీ ‘రోడ్ అండ్ ఆల్కహాల్ అవేర్నెస్ ప్రోగ్రామ్’లో పార్ట్‌నర్స్ అయ్యారు. అంతే కాకుండా వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని చెప్పుకొచ్చాడు కోహ్లీ. ‘‘తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్‌టీఆర్ నా బెస్ట్ ఫ్రెండ్. తనను నటుడిగా చాలామంది ఆదరిస్తారు. ఆర్ఆర్ఆర్‌లో ఎన్‌టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ సినిమా ఆస్కార్ గెలిచినప్పుడు నా సంతోషాన్ని బయటపెట్టడం కోసం నేను కూడా నాటు నాటు స్టెప్పేశాను’’ అని బయటపెట్టాడు విరాట్ కోహ్లీ. ‘రోడ్ అండ్ ఆల్కహాల్ అవేర్నెస్ ప్రోగ్రామ్’లో విరాట్, ఎన్‌టీఆర్ మాత్రమే కాకుండా మరెందరో సెలబ్రిటీలు కూడా పాల్గోనున్నారు.
బాలీవుడ్‌లో డెబ్యూ..
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలకు, అక్కడి ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు ఎన్‌టీఆర్. తనకు ఇప్పుడు బీ టౌన్‌లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ముందుగా తనతో బాలీవుడ్‌లో డెబ్యూ చేయించే అవకాశం కోసం మేకర్స్ అంతా పోటీపడ్డారు. ఫైనల్‌గా తను సోలో హీరో కాకుండా హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఎన్‌టీఆర్. ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కోసం ముంబాయ్ వెళ్లిన ఎన్‌టీఆర్.. అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకొని తిరిగొచ్చాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఎన్నోసార్లు పోస్ట్‌పోన్ అయిన ఈ మూవీ ఫైనల్‌గా అక్టోబర్‌లో విడుదల కానుంది.
Also Read: ‘కన్నప్ప’ టీజర్‌కు అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్ ఫిదా - స్పెషల్ వీడియో షేర్ చేసిన మంచు విష్ణు