Venkatesh: వెంకటేష్ ఎన్నికల ప్రచారం... వియ్యంకుడితో పాటు భార్య మేనమామ కోసం - ఎక్కడెక్కడ అంటే?
Venkatesh to participate in election campaign 2024: హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ఒక చోటు, ఏపీలో ఓ చోటు ఎలక్షన్ క్యాంపైన్ చేస్తారు. ఎవరెవరి కోసం అనేది తెలుసుకోండి.
Actor Venkatesh Election Campaign Schedule Details: తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదరహితుడు విక్టరీ వెంకటేష్. తాను హీరోగా నటించిన సినిమాలు విడుదల అయ్యేటప్పుడు ప్రచారం నిర్వహించడం మినహా ఇతరత్రా సందర్భాల్లో ఆయన బయటకు రావడం తక్కువ. రాజకీయ పరమైన అంశాలకు ఆయన వీలైనంత దూరంగా వుంటారు. అటువంటి వెంకటేష్ రాజకీయ నాయకులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు. దీని వెనుక బంధుత్వాలు ప్రధాన పాత్ర పోషించాయని దగ్గుబాటి ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు, చిత్రసీమ జనాలు చెబుతున్నారు. అసలు ఎవరెవరి కోసం ఎక్కడ ఎక్కడ వెంకటేష్ ప్రచారం చేయనున్నారు? అనేది ఒక్కసారి చూస్తే...
ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోసం...
ఖమ్మంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీల క్యాండిడేట్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ బరిలో కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామిరెడ్డి పోటీలో నిలబడ్డారు. ఆయన వెంకటేష్ వియ్యంకుడు.
వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితకు రామ సహాయం రఘురామిరెడ్డి స్వయానా మామ. ఆయన అబ్బాయి వినాయక్ రెడ్డిని వెంకీ కుమార్తె పెళ్లి చేసుకున్నారు. వియ్యంకుడి కోసం ఖమ్మం లోక్ సభ పరిధిలో వెంకటేష్ ఒక రోజు ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు.
కైకులూరులో భార్య మేనమామ కోసం...
ఏపీలో అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోనూ వెంకటేష్ పాల్గొంటారని తెలిసింది. ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో ఆయన రోడ్ షో చేసే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి నుంచి కామినేని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. వెంకటేష్ భార్య నీరజకు కామినేని శ్రీనివాస్ స్వయానా మేనమామ. అందుకోసం ఆయన తరఫున పోటీ చేయడానికి వెంకటేష్ కదులుతున్నారు.
Also Read: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
తెలంగాణాలోని ఖమ్మంలో వియ్యంకుడు రామ సహాయం రఘురామి రెడ్డికి మద్దతుగా ఒక రోజు, ఏపీలోని కైకలూరులో భార్య మేనమామ కామినేని శ్రీనివాస్ కోసం మరో రోజు వెంకటేష్ ప్రచారం చేయనున్నారు. త్వరలో షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.
ఐదేళ్లు ఎంపీగా చేసిన దగ్గుబాటి రామానాయుడు
వెంకటేష్ తండ్రి, దివంగత నిర్మాత, మూవీ మొఘల్ డా రామానాయుడు ఐదేళ్లు ఎంపీగా చేశారు. తెలుగు దేశం పార్టీ తరఫున బాపట్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 1999లో తొలిసారి ఎంపీగా ఎన్నిక అయ్యారు. పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. అయితే, 2004లో మళ్లీ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మరోసారి ఎంపీగా పోటీ చేయలేదు. రాజకీయాల నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ తప్పుకొంది. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా సురేష్ బాబు, హీరోగా వెంకటేష్ తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా బంధువుల కోసం మాత్రమే వెంకీ రాజకీయ ప్రచారానికి వస్తున్నారు.