Mahendranath Kundla: వరలక్ష్మీ శరత్‌కుమార్ బడ్జెట్ పెంచే వ్యవహారాలు ఎప్పుడూ చేయలేదు - నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల
Sabari Movie: వరలక్ష్మీ శరత్‌కుమార్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రమే ‘శబరి’. ఒక తల్లి, కూతురు అనుబంధంపై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ గురించి నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Mahendranath Kundla About Sabari Movie: లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినా.. వేరికొరి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అయినా వరలక్ష్మీ శరత్ కుమార్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇక త్వరలోనే ‘శబరి’ అనే లేడీ ఓరియెంట్ చిత్రంతో మే3న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ మూవీని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి, ‘శబరి’ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మహేంద్రనాథ్ కూండ్ల.
నిర్మాతగా 50 శాతం సేఫ్...
బిజినెస్ మ్యాన్‌గా సెటిల్ అయిన తనకు సినిమాలంటే ఆసక్తి ఉండడంతో నిర్మాతగా మారానని మహేంద్రనాథ్ కూండ్ల తెలిపారు. ‘శబరి’ కథను తన కంటే ముందే వరలక్షీ శరత్ కుమార్ విని ఓకే చేశారని, ఆవిడ ఓకే చేస్తే తాను నిర్మాతగా 50 శాతం సేఫ్ అనుకొని మూవీ చేయడానికి ఒప్పుకున్నానని బయటపెట్టారు. ఇక వరలక్షీ శరత్ కుమార్‌తో పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘ఆవిడ మంచి ఆర్టిస్ట్. నిర్మాతలకు ఆవిడ చేసే మేలు చాలా మందికి తెలియదు. దీనికి ఖర్చు చేయమని ఆవిడ ఎప్పుడూ అడగలేదు. బడ్జెట్ పెంచే వ్యవహారాలు ఎప్పుడూ చేయలేదు. ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారని, వద్దని చెప్పేవారు. ఆవిడతో ఎంత మంచి రిలేషన్షిప్ ఉందంటే 'మీకు మరో సినిమా చేస్తాను. మనం చేద్దాం' అని నాతో చెప్పారు’’ అన్నారు మహేంద్రనాథ్.
నాకు రిస్కులు అలవాటే..
‘శబరి’ కథ గురించి చెబుతూ... ఇందులో తల్లీకూతుళ్ల అనుబంధం గురించి దర్శకుడు చాలా బాగా చెప్పారని అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ఈ మూవీలో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉందన్నారు. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను తీసుకుని సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేశామని, ఎమోషన్స్‌ను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించామని తెలిపారు. తల్లీకూతుళ్ల రిలేషన్‌షిప్‌పై వచ్చిన ఇతర సినిమాలతో పోలిస్తే ఇందులో ఎమోషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. మొదటి సినిమాతోనే అయిదు భాషల్లో విడుదల చేయడం రిస్క్ అయినా కూడా తనకు రిస్కులు తీసుకోవడం అలవాటని అన్నారు మహేంద్రనాథ్. ‘శబరి’.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఒకేరోజు విడుదల అవుతుందని ప్రకటించారు.
ఒంటరిగా నిలబడ్డాను..
‘శబరి’లో వరలక్ష్మీ శరత్‌కుమార్.. యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా పాల్గొన్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. అయితే కథలో భాగంగానే యాక్షన్ సీక్వెన్స్‌లు వస్తాయని, కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండవని క్లారిటీ ఇచ్చారు మహేంద్రనాథ్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంతో కష్టపడిందని ప్రశంసించారు. తనకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లు, బంధువులు ఎవరూ లేకపోయినా.. ఒంటరిగా నిలబడి ‘శబరి’ని పూర్తిచేశానని అన్నారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని బయటపెట్టారు. ఇక తన అప్‌కమింగ్ చిత్రాల గురించి చెప్తూ వరుణ్ సందేశ్‌తో ఒక మూవీ ఉందని, బిగ్ బాస్ అమర్‌దీప్, సుప్రిత హీరోహీరోయిన్లుగా మరో మూవీ నిర్మిస్తున్నానని అన్నారు. ఇక భవిష్యత్తులో నటించే అవకాశాలు ఉన్నాయా అని అడగగా.. అలాంటి ఆలోచనలు లేవని క్లారిటీ ఇచ్చారు మహేంద్రనాథ్ కూండ్ల.
Also Read: ప్రాణంగా ప్రేమించే మ్యూజిక్ షాప్ అమ్మేస్తే? నవ్విస్తూనే ఏడ్పిస్తున్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్!