(Source: ECI/ABP News/ABP Majha)
Varalaxmi Sarathkumar: వరలక్ష్మి 'సివంగి'తో దర్శకుడిగా వస్తున్న సినిమాటోగ్రాఫర్
అభినయంతో పేరు పొందిన నటీమణులు ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా 'సివంగి'. దీంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భరణి కె ధరన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.
సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారడం కొత్త కాదు. మెగా ఫోన్ పట్టి బ్లాక్ బస్టర్లు కొట్టిన కెమెరా మ్యాన్ల జాబితాలో తెలుగు వారూ ఉన్నారు. 'చిత్రం'తో దర్శకుడిగా కాకముందు తేజ సినిమాటోగ్రాఫర్. 'రంగం' వంటి బ్లాక్ బస్టర్ తీసిన కెవి ఆనంద్ సైతం ఇండస్ట్రీలో ఛాయాగ్రాహకుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. రవితేజ 'ఈగల్' డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, నందమూరి కళ్యాణ్ రామ్ '118' దర్శకుడు కెవి గుహన్ సైతం సినిమాటోగ్రాఫర్లు. అంత ఎందుకు? సూర్య హీరోగా 'కంగువా' వంటి భారీ సినిమా తీస్తున్న శివ కూడా ఫస్ట్ కెమెరా మ్యానే. ఇప్పుడీ జాబితాలోకి మరో సినిమాటోగ్రాఫర్ వస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
'సివంగి'తో దర్శకుడిగా భరణి కె ధరన్!
విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), తెలుగు అమ్మాయి ఆనంది (Anandhi) ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న సినిమా 'సివంగి' (Sivangi Movie). ఈ సినిమాలో జాన్ విజయ్ (John Vijay) మరో ప్రధాన పాత్రధారి. నలభైకు పైగా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కె ధరన్ (Bharani K Dharan) ఈ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. దీనిని ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై నరేష్ బాబు పి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అగ్ర హీరోల సినిమాల్లో విలనిజం ప్రదర్శిస్తూ... 'హనుమాన్' వంటి సినిమాలో సిస్టర్ రోల్, 'శబరి' వంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో మెయిన్ లీడ్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో ఎంతో మందిని అభిమానులుగా చేసుకున్నారు. ఆనంది సైతం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండటం 'సివంగి' స్పెషాలిటీ.
సివంగి... ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ!
మహిళా ప్రాధాన్య కథతో ఫిమేల్ సెంట్రిక్ మూవీగా 'సివంగి'ని రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. భరణి కె ధరన్ మాట్లాడుతూ... ''ఓ మహిళ తనకు జీవితంలో ఎదురైన అసాధారణ, అనూహ్యమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ఎలా నిలబడింది? సివంగిలా ఎలా పోరాటం చేసింది? అనేది సినిమా కథాంశం. జానర్ విషయానికి వస్తే... ఇదొక డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలతో పాటు అన్ని కమర్షియల్ హంగులు, కుటుంబ విలువలు ఉన్న చిత్రమిది. స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది'' అని చెప్పారు. త్వరలో విడుదల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత నరేష్ బాబు వివరించారు.
Also Read: గీతాంజలి మళ్ళీ వచ్చింది... ఈ రాత్రి నుంచి స్ట్రీమింగ్ షురూ, ఏ ఓటీటీలోనో తెలుసా?
ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్, డా. కోయ కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఏహెచ్ కాసిఫ్ - ఎబినేజర్ పాల్, ఛాయాగ్రహణం: భరణి కె ధరన్, కూర్పు: సంజిత్ ఎంహెచ్డీ, కళా దర్శకత్వం: రఘు కులకర్ణి, నిర్మాణ సంస్థ: ఫస్ట్ కాపీ మూవీస్, నిర్మాత: నరేష్ బాబు .పి, రచన - దర్శకత్వం: భరణి కె ధరన్.
Also Read: విద్య వాసుల అహం... థియేటర్లలో కాదు, డైరెక్టుగా ఓటీటీలో!