Unni Mukundan: మేనేజర్‌ను కొట్టడంతో పాటు బూతులు తిట్టిన హీరో... పోలీస్ స్టేషన్‌లో కేసు... కేరళలో హాట్ టాపిక్
వయలెంట్ యాక్షన్ ఫిలిం 'మార్కో'తో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ భారీ హిట్ అందుకున్నారు. ఆ విజయం తర్వాత ఆయన ప్రవర్తన విమర్శలకు కారణం అవుతోంది. తాజాగా తనను కొట్టారని మేనేజర్ ఆయన మీద కేసు పెట్టారు.

ఉన్ని ముకుందన్ (Unni Mukundan) మలయాళ హీరో. అయితే అతను తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అనుష్క 'భాగమతి'లో హీరోగా నటించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో మోహన్ లాల్ కుమారుడి క్యారెక్టర్ చేశారు. ఇక, వయలెంట్ యాక్షన్ ఫిల్మ్ 'మార్కో' మూవీతో తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు. కలెక్షన్స్ పరంగా ఆ సినిమా 100 కోట్లు క్రాస్ చేసింది. అయితే 'మార్కో' విజయం తర్వాత ఉన్ని ముకుందన్ ప్రవర్తన విమర్శలకు కారణం అవుతోంది. తాజాగా ఆయన మీద సొంత మేనేజర్ కేసు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే...
టోవినో థామస్ మూవీ బాగుందంటావా?
బూతులు తిడుతూ మేనేజర్‌ను కొట్టిన ఉన్ని!
టోవినో థామస్ హీరోగా నటించిన 'నిరవెట్టా' ఇటీవల విడుదలైంది. ఆ సినిమా బావుందంటూ ఉన్ని ముకుందన్ మేనేజర్ విపిన్ కుమార్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అది ఉన్నీకి నచ్చలేదు. దాంతో విపిన్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత గొడవ జరిగింది. తనకు ఫ్లాట్ నుంచి కిందకు పిలిచి బూతులు తిడితూ కొట్టారని విపన్ కుమార్ కేసు పెట్టారు.
ఉన్ని ముకుందన్ దగ్గర ఆరేళ్ల నుంచి తాను మేనేజర్ కింద పని చేస్తున్నానని విపిన్ కుమార్ తెలిపారు. తనను ఉన్ని ముకుందన్ అసభ్యకరమైన పదాలతో దూషించడంతో పాటు కొట్టారని ఇన్ఫో పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంకా విపిన్ కుమార్ ఏం అన్నారంటే... ''నేను ఆరేళ్ల నుంచి ఉన్ని ముకుందన్ దగ్గర పని చేస్తున్నాను. అతని ప్రవర్తన బాలేనప్పటికీ అలాగే పని చేస్తున్నా. అయితే ఈ మధ్య కాలంలో అతనిలో ఫ్రస్టేషన్ మరీ ఎక్కువైంది. 'మార్కో' విడుదల తర్వాత మంచి సినిమాలు రావడం లేదు. 'గెట్ సెట్ బేబీ' కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. ఉన్ని ముకుందన్ దర్శకుడు కావాలని అనుకున్నారు. ఆ మూవీని గోకులం మూవీస్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ తర్వాత వెనక్కి వెళ్లారు. దాంతో ఉన్నీలో ఫ్రస్టేషన్ మరీ ఎక్కువైంది. చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మీద దాన్ని చూపించడం మొదలు పెట్టారు'' అని చెప్పుకొచ్చారు. ఉన్ని కోపం వల్ల అతని దగ్గర ఎక్కువ కాలం ఎవరూ పని చేయడం లేదని, ఒకసారి చేసిన వాళ్ళు మానేశాక మళ్ళీ వెనక్కి రావడం లేదని పేర్కొన్నారు. అతడిని ఇంకెంత కాలం భరించాలని విపిన్ కుమార్ ప్రశ్నించారు.
Also Read: సురేష్ బాబును కార్నర్ చేసిన దిల్ రాజు... పవన్ దెబ్బకు నెక్స్ట్ బయటకు వచ్చేది ఎవరు?
Unni Mukundan’s manager @vvipink speaks out about the alleged assault: pic.twitter.com/xs3FPue0gX
— ForumKeralam (@Forumkeralam2) May 26, 2025
''నేను 18 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పీఆర్ కన్సల్టెంట్ కింద ఉన్నాను. హీరో హీరోయిన్లు, నటీనటులతో పాటు సినిమాలకు కూడా ప్రమోషనల్ వర్క్ చేస్తాను. సుమారు 500కు పైగా సినిమాలకు పీఆర్ చేశాను. 'నిరవెట్టా' ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో సినిమాను పొగుడుతూ ఒక పోస్ట్ చేశా. అది ఉన్నికి నచ్చలేదు, దాంతో ఫోన్ చేసి కోప్పడ్డారు. నన్ను మేనేజర్ ఉద్యోగం నుంచి తీసేశారు. సరే అనుకున్నాను. అయితే ఇంటికి వచ్చి మరి నన్ను తిట్టారు. ఉన్ని కొట్టడం వల్ల నా కళ్ళజోడు విరిగింది'' అని విపిన్ కుమార్ తెలిపారు. ఆ మధ్య ఒక అభిమాని తనను వీడియో తీస్తుంటే... ఫోన్ లాక్కుని జేబులో పెట్టుకుని ఉన్ని ముకుందన్ వెళ్లిపోయారు. ఇప్పుడు మేనేజర్‌ను కొట్టారు. ప్రజెంట్ ఆ బిహేవియర్ కేరళలో హాట్ టాపిక్ అయ్యింది.






















