Sanjeev Reddy : సినీ, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టాలీవుడ్ దర్శకుడు లేఖ
Sanjeev Reddy : టాలీవుడ్ యువ దర్శకుడు సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తన అభ్యర్థనలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో కాంగ్రెస్ అధికారం అందుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ గెలవడం, తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం అన్ని జరిగిపోయాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ తెలుగు యువ దర్శకుడు సోషల్ మీడియా వేదికగా వినతి పత్రం ఇచ్చాడు. అంతేకాకుండా సినీ పరిశ్రమని కళాకారులను పట్టించుకోవాలని కోరాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు అల్లు శిరీష్ తో ABCD మూవీ, రాజ్ తరుణ్ తో ‘పెళ్లి సందడి’ అనే వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన సంజీవ్ రెడ్డి.
సంజీవ్ తన ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని విన్నపాలు చేసుకున్నాడు. ప్రభుత్వాలు ఎన్నిసార్లు మారినా హైదరాబాదులో వర్షం పడితే రోడ్లన్నీ జలమయం అయిపోవడం, ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికీ తీరకపోవడం సర్వసాధారణంగా మారింది. ఇదే విషయాన్ని సంజీవ్ రెడ్డి తన వినతిపత్రంలో తెలిపాడు. దాంతోపాటు రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం తరఫున సినిమా వారికి అవార్డులు ఇవ్వడం లేదనే విషయాన్ని నూతన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. డైరెక్టర్ సంజీవరెడ్డి చేసిన అభ్యర్థనలను గమనిస్తే..
Dear Chief Minister @revanth_anumula Garu (MAUD, G.A., Law & Order) and Minister for R&B and Cinematography @KomatireddyKVR Garu, attached are posters presenting requests for your consideration. #OnlinePrajaDarbar #DigitalPrajaDarbar pic.twitter.com/KlM2OX88kq
— Sanjeev Reddy (@sanjeevflicks) December 11, 2023
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించిన సమస్యలివే.
- వర్షాల తర్వాత నిండే రోడ్లను మరియు పొంగే నాళాల సమస్యను మీ టర్మ్ లో వీలైనంత త్వరగా పరిష్కరించగలరు.
- ప్రజా ప్రతినిధులకు ట్రాఫిక్ ని క్లియర్ చేసినట్టుగానే అంబులెన్స్ లకు కూడా క్లియర్ చేయిస్తే లేదా ఎమర్జెన్సీ వెహికల్ ప్రిమ్షన్ ను సరిగ్గా అమలు చేస్తే ఎన్నో ప్రాణాలను కాపాడిన వారు అవుతారు.
- ట్రాఫిక్ సిగ్నల్ ల వద్ద పసిపిల్లలతో భిక్షాటన చేయించే వారిని కఠినంగా శిక్షించగలరు.
- ప్రతి కూడలి (జంక్షన్) లో మీరు కూడా ఆగి తాగగలిగేంత పరిశుభ్రమైన నీటి వసతిని ఏర్పాటు చేయగలరు.
- ప్రతి కూడలి వద్ద మీరు సైతం ఆగి వాడుకోగలిగేంత పరిశుభ్రమైన టాయిలెట్లని కట్టించగలరు.
- రోడ్లమీద బాగా దూరం వెళ్లి తీసుకునే యూటర్న్ దూరాన్ని తగ్గించగలరు.
- పార్కింగ్ ప్లేస్‌లను పెంచగలరు.
- తెలంగాణ రాష్ట్ర సినిమా అవార్డులను, ఫిలిం ఫెస్టివల్స్ ని మొదలు పెట్టగలరు.
- ప్రత్యేకమైన ఫిలిమ్ స్కూల్ ని ప్రారంభించగలరు.
- కళాకారులు సాంకేతిక నిపుణులు ఎక్కువగా ఉండే కృష్ణానగర్, మణికొండ ప్రాంతాల దగ్గరలో నాటకాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు ఆడిటోరియాలు కట్టించగలరు.
- తెలంగాణ సినిమాలకు చిన్న, సినిమాలకు, పిల్లల సినిమాలకు ప్రభుత్వ సబ్సిడీ, పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వగలరు.
- అర్హులైన కళాకారులకు సాంకేతిక నిపుణులకు, పాత్రికేయులకు మీ పద్ధతుల ప్రకారం ఇల్లు లేదా స్థలాలు ఇచ్చి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, చైతన్యవంతమైన సృజనాత్మక వాతావరణానికి దోహదపడగలరు.