Raithanna Movie: ఇక దేశంలో మిగిలేది రైతు కూలీలే.. వ్యవసాయ చట్టాలపై నారాయణ మూర్తి సీరియస్ కామెంట్స్..
ఆర్ నారాయణ మూర్తి నటించిన రైతన్న సినిమాను ప్రజలు ఆదరించాలని కోరారు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆగస్టు 14న సినిమా రిలీజ్ సందర్భంగా నారాయణమూర్తి.. మంత్రుల నివాస సముదాయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
రైతన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సమాజ హితం కోసం ఎన్నో మాధ్యమాల ద్వారా పలువురు కృషి చేస్తుంటారు. సినిమాల ద్వారా ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి, తెలుగు ప్రజలకు సుపరిచితుడు ఆర్ నారాయణ మూర్తి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
రైతులు, ప్రజలు, మీడియాతోపాటు సమాజంలోని అందరూ ఈ సినిమాను చూడాలని నిరంజన్ రెడ్డి కోరారు. ప్రజల హితాన్ని కోరే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వ్యాపార విలువలే ప్రధానంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజల కోసం, రైతులహితాన్ని కాంక్షిస్తూ వస్తున్న ప్రభోధాత్మక సినిమా రైతన్న అన్నారు. ప్రజా ప్రయోజనం జరిగే కృషి ఏ రంగంలో వారు చేసినా మనం స్వాగతించాలన్నారు. ఒక శ్యాం బెనగల్, ఒక మృణాల్ సేన్ మాదిరిగా తెలుగులో నారాయణమూర్తి గారు సినిమాలను తీస్తున్నారని నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నెల 14న విడుదలవుతున్న రైతన్న సినిమాను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
రైతు బంధుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని అన్నారు సినీ నిర్మాత, దర్శకుడు, హీరో ఆర్. నారాయణ మూర్తి. 36 ఏళ్లుగా దేశంలో సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు…తాను సినిమాల ద్వారా స్పందిస్తున్నా అన్నారు. అర్ధరాత్రి స్వాతంత్రం నుంచి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానన్న నారాయణమూర్తి…. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో రూపొందిన రైతన్న సినిమా ఈ నెల 14న విడుదల కాబోతుందని..అందరూ ఆదరించాలని కోరారు.
కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు, కరెంటు చట్టాలు రైతులకు వరాలు కావు, శాపాలుగా మారబోతున్నాయి. ఎనిమిది నెలలుగా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఓవైపు కరోనా విపత్తులో ప్రపంచం వణికిపోతుంటే రైతులు మాత్రం ధైర్యంగా వ్యవసాయం చేసి ఆహారం అందించారన్న నారాయణ మూర్తి ఇలాంటి చట్టాలు భారతదేశానికి మంచివి కావని అభిప్రాయపడ్డారు. ఇటీవల బీహార్లో మార్కెట్లు ఎత్తేస్తే గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిలలాడుతున్నారు. స్వేచ్చా వాణిజ్యం పేరుతో రైతుల మెడకు ఉరి బిగించడం తగదని ఆర్ నారయణ మూర్తి అన్నారు.
బీహార్లో ఇప్పుడు రైతులు లేరు కేవలం రైతు కూలీలే మిగిలారు. కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే ఈ దేశంలో కూడా రైతు కూలీలే మిగులుతారు… కేంద్రం కొత్త చట్టాలను పక్కకు పెట్టి స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని నారాయణమూర్తి కోరారు…