Actress Ramya Sri Attacked: హైదరాబాద్‌లో నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై దాడి- గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు
Sandhya Convention | టాలీవుడ్ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Actress Ramya Sri Attacked: టాలీవుడ్ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడిపై హైదరాబాదులో దాడి జరిగింది. సంధ్యా కన్వెన్షన్ (Sandhya Convention) పక్కన ఉన్న ఎఫ్సీఐ కాలనీ లేఔట్ కు సంబంధించి హైడ్రా మార్కింగ్ చేయడం వావాదానికి దారితీసింది. హైడ్రా అ ధికారులు మార్కింగ్ చేస్తుండగా వీడియో తీసిన రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంతపై దాడి జరిగింది.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారిని అనుకుని ఉన్న ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో సంధ్య కన్వెన్షన్ ఆక్రమణలను హైడ్రా అధికారులు నెల రోజుల కిందట తొలగించారు. పర్మిషన్ లేకుండా నిర్మించిన ఒక మినీ హాల్ రెండు షెడ్లు, కొన్ని గదులను హైడ్రా కూల్చివేసింది. అయితే సంధ్య కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్ రావు ఎఫ్ సి ఐ లేఔట్ లో రోడ్లు పార్కుల ఆనవాళ్లు లేకుండా చేశారని ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు.
వీడియో ఎందుకు తీశావంటూ దాడి
ప్లాట్ యజమానుల వినతి మేరకు శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు, హైడ్రా అధికారులు మంగళవారం నాడు ఎఫ్‌సీఐ లేఔట్లలో రహదారుల గుర్తింపు పనులు చేపట్టారు. లైన్లు మార్కింగ్ చేస్తుండగా లేఔట్‌లో ఓ ప్లాట్ యజమాని అయిన రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్‌తో కలిసి తమ ఫోన్లో వీడియో తీశారు. అనంతరం మధ్యాహ్నం లంచ్‌కు వెళ్తున్న సమయంలో రమ్యశ్రీ, ఆమె సోదరుడ్ని కొందరు అడ్డుకున్నారు. వీడియోలు ఎందుకు తీశారంటూ వారి వద్ద ఉన్న ఫోన్ లాక్కునేందుకు చూడగా, అడ్డుకున్న ప్రశాంత్‌ను నిందితులు కొట్టారు. ఏ తప్పు లేకున్నా తమపై దాడి చేసిన సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు అనుచరులపై చర్యలు తీసుకోవాలి గచ్చిబౌలి పోలీసులకు నటి రమ్యశ్రీ ఫిర్యాదు చేశారు. వీరి మధ్య గొడవపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. పోలీసులు బందోబస్తు నడుమ అధికారులు లేఔట్ రోడ్ల మార్కింగ్ చేశారని, అధికారుల సమక్షంలో గొడవ జరగలేదని తెలిపారు.






















