'మేమ్ ఫేమస్' ట్రైలర్ రిలీజ్ - 'జాతిరత్నాలు' రేంజ్ హిట్ కొడతారా?
సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ 'మేమ్ ఫేమస్'. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబడింది.
ఇటీవల కాలంలో డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో రిలీజ్ కు ముందే అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా 'మేమ్ ఫేమస్'. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ఇది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ & లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
'ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లైతాది.. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లైతాది.. ఈ మై గానోళ్లతోని పెట్టుకుంటే లొల్లైతాది' అంటూ తెలంగాణ యాసలో హీరో చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఓ పల్లెటూరులో అల్లరి చిల్లరగా తిరిగే ముగ్గురు కుర్రాళ్లు.. వారి మధ్య స్నేహం, హీరో లవ్ స్టోరీ వంటివి ఇందులో మనం చూడొచ్చు. వీరు ముగ్గురూ ఫేమస్ అవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత ఏం చేసారు? ఈ క్రమంలో జెనెరేట్ అయ్యే ఫన్, ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ వెరసి 'మేమ్ ఫేమస్' సినిమా అని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.
'జిందగీ ఇట్టనే హల్క ఉంటుందనుకున్నా మోనికా.. తిప్పి కొట్టింది చూడూ..', 'మీ ఇంట్లో ఉన్న పోరల్ని మీరు నమ్మితే.. ఇట్లాంటి పోరలు మస్తు మంది వస్తారు. యూత్ ని ఎంకరేజ్ చేయాలే, దమ్ దమ్ చేయొద్దు..' వంటి డైలాగ్స్ ఈ ట్రైలర్ లో వినిపిస్తున్నాయి. తాగే ఒక్క గ్లాస్ థంప్స్ అప్ కు.. బకెట్ నిండా స్టఫ్ తింటడు వీడంటూ సాధారణంగా యూత్ మాట్లాడుకునే మాటలు అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూర్చగా, శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సృజన అడుసుమిల్లి ఎడిటర్ గా, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
ఓవరాల్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన 'మేమ్ ఫేమస్' ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో 'జాతిరత్నాలు' 'ఫస్ట్ డే ఫస్ట్ షో' లాంటి సినిమాలను గుర్తుకు తెస్తోంది. ఆ చిత్రాల మాదిరిగానే యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకొని తీసినట్లు అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మంచి యూత్ ఫుల్ కామెడీ ఎంటెర్టైనెర్ ఏదీ రాలేదు కాబట్టి, ఈ ట్రైలర్ లో చూపించిన అంశాలు, సరదా సంభాషణలు కనెక్ట్ అయితే ఈ చిన్న సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది.
'మేమ్ ఫేమస్' చిత్రాన్ని అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రు, మనోహరన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో తమకున్న పరిచయాలతో ఇతర హీరో హీరోయిన్లు, దర్శకులను కూడా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగం చేస్తున్నారు. బుధవారం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని, దర్శకులు బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేసారు.
'మేమ్ ఫేమస్' మూవీని మే 26వ తేదీన థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా 'జాతిరత్నాలు' రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుందో లేదో చూడాలి.
Read Also: 100 కోట్ల క్లబ్‌లో 'విరూపాక్ష' - ఆ హీరోల సరసన చేరిన మెగా మేనల్లుడు