Thaman - Anil Ravipudi : బోయపాటి vs తమన్ - తెలివిగా తమన్‌కు ఓటేసిన అనిల్ రావిపూడి
Anil Ravipudi on Thaman background score : తమన్ నేపథ్య సంగీతం గురించి అనిల్ రావిపూడి గొప్పగా చెప్పారు. బోయపాటిని తక్కువ చేయకుండా సంగీత దర్శకుడిని సపోర్ట్ చేశారు.
దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu), సంగీత దర్శకుడు తమన్ మధ్య సఖ్యత లేదని 'స్కంద' విడుదల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే అర్థం అవుతోంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'స్కంద' నేపథ్య సంగీతం విషయంలో చాలా మంది తనకు కంప్లైంట్స్ చేశారని బోయపాటి శ్రీను తెలిపారు. తమన్ నేపథ్య సంగీతం లేకుండా చూసినా 'అఖండ' శక్తివంతంగా ఉంటుందని ఆయన చెప్పారు. 'స్కంద' విడుదలైన తర్వాత నుంచి తమన్ (Thaman)తో తాను మాట్లాడలేదని చెప్పారు.
బోయపాటి వ్యాఖ్యలపై తమన్ నేరుగా స్పందించలేదు. కానీ, 'డోంట్ కేర్' అంటూ ట్వీట్ చేశారు. అది బోయపాటిని ఉద్దేశించి చేశారని జనాలు భావించారు. అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమాలో పాటలు గానీ, ఆ సినిమా సంగీతం గానీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. 'అఖండ' విజయంలో తమన్ నేపథ్య సంగీతానికి ఎక్కువ మంది క్రెడిట్ ఇస్తారు. బోయపాటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సంగీత దర్శకుడికి ఎక్కువ మద్దతు లభించింది. 'భగవంత్ కేసరి' దర్శకుడు అనిల్ రావిపూడి మద్దతు సైతం మద్దతు తెలిపారు.
కంటెంట్ మాత్రమే పని చేయించుకుంటుంది!
తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించిన సినిమాలు ఉన్నాయని, అదే సమయంలో అతడిని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఎవరితో అయినా సరే కంటెంట్ మాత్రమే పని చేయించుకుంటుందని, దర్శకుడు కాదని ఆయన వివరించారు.
సంగీత దర్శకులను పిండి పని చేయించుకుంటానని గతంలో బోయపాటి శ్రీను చెప్పారు. ఆయన పేరు ప్రస్తావించకుండా ఆ వ్యాఖ్యలను గుర్తు చేసే ప్రయత్నం చేయగా... ఆ స్పేసులోకి తాను వెళ్లదలుచుకోవడం లేదని అనిల్ రావిపూడి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. అదే సమయంలో తమన్ పని పట్ల బలంగా చెప్పారు.
''నేను సహాయ దర్శకుడిగా పని చేసే రోజుల నుంచి తమన్ నాకు తెలుసు. మా మధ్య మంచి పరిచయం ఉంది. అతడికి సినిమా అంటే ప్రాణం. 'భాగమతి', 'అఖండ', 'బిజినెస్ మాన్' సినిమాలకు తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. కథ, సన్నివేశాలపై ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వర్క్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం అద్భుతంగా తీసిన దానిని నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్లడం సంగీత దర్శకుడి బాధ్యత. నాకు తెలిసి 80 నుంచి 90 శాతం చేస్తూ ఉన్నాడని అనుకుంటున్నా. అతను కావాలని ఏ సినిమా చెడగొట్టాలని అనుకోడు. సంగీత దర్శకుడు మాత్రమే కాదు... హిట్టూ ఫ్లాపులకు ఎవరూ అతీతులు కారు. మ్యాగ్జిమమ్ బావుండాలని ట్రై చేస్తాడు తమన్'' అని అనిల్ రావిపూడి చెప్పారు.
Also Read : 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?
'భగవంత్ కేసరి'కి రేయింబవళ్లు పని చేస్తున్నాడని అనిల్ రావిపూడి చాలా ధీమాగా చెప్పారు. తమన్ బెస్ట్ వర్క్ సినిమాలో చూస్తారని ఆయన పేర్కొన్నారు. అతని వర్క్ పట్ల తమకు ఎటువంటి అసంతృప్తి లేదని ఆయన చెప్పారు. 'బ్రో', 'స్కంద' సినిమాల్లో తమన్ సంగీతం పట్ల కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి చెప్పిన మాటలు చూస్తుంటే... విమర్శలకు తమన్ సమాధానం చెబుతాడని అనుకోవచ్చు.
Also Read : 'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ - దసరాకు టీజర్ రిలీజ్, అదీ ఎప్పుడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial