Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కథతో దళపతి విజయ్ సినిమా - ఫహాద్ ఫాజిల్ తండ్రితో పవర్ స్టార్ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?
Pawan Kalyan - Fazil Movie: 'పుష్ప' తర్వాత ఫహాద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిశారు. ఆయన తండ్రి ఫాజిల్ మలయాళ దర్శకుడు. పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కెరీర్‌లో నటించిన సినిమాల కంటే ఆయన వదులుకున్నవి ఎక్కువే ఉన్నాయి. ఆగిపోయినవి ఇంకొన్ని ఉన్నాయి. 'సత్యాగ్రహి', 'కోబలి'... ఇలా పవర్ స్టార్ సినీ జర్నీలో ఆగిపోయిన సినిమాల లిస్ట్ పెద్దదే. కొన్ని సినిమాలకు అనౌన్స్‌మెంట్ తర్వాత ఆగిపోతే... మరికొన్ని సినిమాలకు చర్చల దశలోనే పుల్ స్టాప్ పడింది. కారణాలు ఏవైనా అగ్ర దర్శకులతో పవన్ కళ్యాణ్ కాంబోను చూసే అవకాశాన్ని ప్రేక్షకులు మిస్ అయ్యారు.
మలయాళ దర్శకుడితోనూ పవన్ సినిమా ఆగింది!
తెలుగు దర్శకులతోనే కాకుండా మలయాళ, తమిళ దర్శకులతో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలు కొన్ని వర్కవుట్ కాలేదు. వాటిలో ఫహాద్ ఫాజిల్ తండ్రి మూవీ కూడా ఒకటి. 'పుష్ప' విడుదల తర్వాత తెలుగు ప్రేక్షకులు అందరికీ ఫహాద్ ఫాజిల్ తెలిశారు. అందులో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఆయనకు పేరు తెచ్చింది. అయితే... ఫహాద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ మలయాళ, తమిళ భాషల్లో టాప్ డైరెక్టర్లతో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్, దళపతి విజయ్ వంటి స్టార్లకు ఆయనకు బ్లాక్ బస్టర్స్ హిట్స్‌ను అందించారు. పవన్ హీరోగా ఆయన ప్లాన్ చేసిన ఒక సినిమా ఆగింది.
'తొలి ప్రేమ' తర్వాత... ఫాజిల్ దర్శకత్వంలో సినిమా!
'తొలి ప్రేమ' బ్లాక్ బస్టర్ తర్వాత ఫాజిల్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కోసం రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు ఫాజిల్. 'తొలి ప్రేమ' సినిమాను నిర్మించిన జీవీజీ రాజు పవన్ కళ్యాణ్, ఫాజిల్ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అనౌన్స్‌మెంట్‌తోనే అభిమానుల్లో ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. పవన్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ ఖాయమంటూ అభిమానులు భావించారు. అయితే చివరకు ఆ సినిమా రాలేదు. ప్రకటన తర్వాత సినిమాకు ఫుల్ స్టాప్ పడింది.
పవన్ హీరోగా ఆగిన సినిమా... దళపతి విజయ్ 25వ సినిమా!
పవన్ కళ్యాణ్, ఫాజిల్ మూవీకి ఎందుకు ఫుల్ స్టాప్ పడిందనేది బయటకు రాలేదు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా సెట్స్‌పైకి రాలేదని అప్పట్లో వినిపించింది. పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథతో తమిళంలో దళపతి విజయ్ హీరోగా 'కన్నుక్కుల్ నిళవు' సినిమా చేశారు ఫాజిల్. విజయ్ కెరీర్‌లో 25వ సినిమా రూపొందిన ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ట్రెండ్ సెట్టర్ అని పేరు తెచ్చుకుంది.
Also Read: నాగ్ మామ కాదు... నాగ్ సామ - అదీ జపాన్‌లో మన కింగ్ క్రేజ్!
తమిళ సినిమా విజయ్ జంటగా అజిత్ వైఫ్, అప్పట్లో హీరోయిన్ షాలిని యాక్ట్ చేసింది. తెలుగు హీరోయిన్ కళ్యాణి ఆ సినిమాతోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలోని పాటలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. అలా పవన్ కళ్యాణ్ కథతో దళపతి విజయ్ పెద్ద హిట్‌ను అందుకున్నారు.
Also Read: గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'కింగ్‌డమ్' సాంగ్... పాడింది అనిరుధ్ కాదు, ఎవరో తెలుసా?
Pawan Kalyan Upcoming Movies: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ఆయన నటించిన హిస్టారికల్ మూవీ 'హరి హర వీరమల్లు' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాకు క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. 'హరి హర వీరమల్లు' తర్వాత 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' లైనులో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ' సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్ చిత్రీకరణ తాజాగా పూర్తి అయింది.





















