Taraka Ratna Passed Away : విలన్‌గా నంది అవార్డు - హీరోగా ఒక్క రోజు 9 సినిమాలకు క్లాప్ కొట్టిన తారకరత్న
Taraka Ratna Death Film Journey : నందమూరి తారకరత్న హీరోగా చేసిన సినిమాల సంఖ్య తక్కువే. అయితే, ఇండస్ట్రీలో ఆయన ప్రవేశం ఓ సంచలనం.
![Taraka Ratna Passed Away : విలన్‌గా నంది అవార్డు - హీరోగా ఒక్క రోజు 9 సినిమాలకు క్లాప్ కొట్టిన తారకరత్న Taraka Ratna Passed Away Nandamuri taraka Ratna filmography, Early Life, Awards as villain Know In Details Taraka Ratna Passed Away : విలన్‌గా నంది అవార్డు - హీరోగా ఒక్క రోజు 9 సినిమాలకు క్లాప్ కొట్టిన తారకరత్న](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/28/45cc8376c36f146651c417483cd105601674912210006313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) హీరోగా చేసిన సినిమాల సంఖ్య తక్కువే. చేసిన సినిమాల్లో విజయాల శాతం కూడా తక్కువ. అయితే, తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఆయన ప్రవేశం ఓ సంచలనం. తారక రత్న ఎంట్రీ హాట్ టాపిక్ అయ్యింది. నందమూరి తారక రామారావు నట వారసత్వంతో, ఆయన మనవడిగా... మోహనకృష్ణ కుమారుడిగా చిత్రసీమకు వచ్చారు.
ఒక్క రోజే తొమ్మిది సినిమాలు...
ఒక్క రోజు తొమ్మిది సినిమాలకు క్లాప్ కొట్టిన ఘనత నందమూరి తారక రత్నది. ఆ తొమ్మిదింటిలో కొన్ని సెట్స్ మీదకు వెళ్ళాయి. మరికొన్ని ఆ రోజు వార్తకు మాత్రమే పరిమితం అయ్యాయి. అసలు ఆ సినిమాలు ఓపెనింగ్ జరిగే వరకు తారకరత్న ఎలా ఉంటారనేది ప్రేక్షకులు, ఇండస్ట్రీలో కొందరికి తప్ప మిగతా వాళ్ళకు అసలు తెలియదు.
ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో తారకరత్న తొమ్మిది సినిమాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆ రోజు అతడిని చూడటానికి చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు మీడియా కూడా ఆసక్తి కనబరిచింది.
'ఒకటో నంబర్ కుర్రాడు'లో పాటలు హిట్టే గానీ...
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ భాగస్వామ్యంతో నిర్మించిన 'ఒకటో నంబర్ కుర్రాడు' సినిమాతో హీరోగా తారకరత్న టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో పాటలు సూపర్ హిట్. ఇప్పటికీ 'నెమలీ కన్నోడా...', 'నువ్ చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా...', 'తొడగొట్టి చెబుతున్నా...' అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటాయి.
'ఒకటో నంబర్ కుర్రాడు' తర్వాత 'యువరత్న', 'తారక్', 'భద్రాద్రి రాముడు' తదితర సినిమాల్లో హీరోగా నటించారు. అయితే, ఆయనకు ఎక్కువ విజయాలు రాలేదు. కానీ, ఆయన సినిమాల్లో పాటలు కొన్ని సూపర్ హిట్ అయ్యాయి.
ప్రతినాయకుడిగా నంది
హీరోగా వరుస వైఫల్యాలు వస్తున్న సమయంలో విలన్ వేషాలు వేయడానికి తారక రత్న ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గరైన చలపతి రావు కుమారుడు, నటుడు రవిబాబు దర్శకత్వం వహించిన 'అమరావతి'లో ప్రతినాయకుడిగా నటించారు. ఆ నిర్ణయం ఆయనకు మేలు చేసింది. విలనిజానికి గాను నంది అవార్డు తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ హీరోగా కొన్ని సినిమాలు చేసినా విజయాలు రాలేదు.
నారా రోహిత్ 'రాజా చెయ్యి వేస్తే'లోనూ తారక రత్న విలనిజం చూపించారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. 'దేవినేని' సినిమాలో దేవినేని నెహ్రూ పాత్ర పోషించారు. థియేటర్లలో విడుదలైన తారకరత్న చివరి సినిమా అంటే 'ఎస్ 5' అని చెప్పాలి. గత ఏడాది డిసెంబర్ 31న ఆ సినిమా విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలియదు. అందులో సాయి కుమార్, సునీల్, తారక రత్న నటించారు.
'9 అవర్స్'తో ఓటీటీలో ఎంట్రీ!
ట్రెండ్, న్యూ ఏజ్ కంటెంట్ ఫాలో అవుతూ... తారకరత్న గత ఏడాది డిజిటల్ స్క్రీన్ మీదకు వచ్చారు. ఓటీటీకి ఆయన పరిచయం అయ్యారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రచన, సమర్పణలో వచ్చిన '9 అవర్స్' వెబ్ సిరీస్ చేశారు. అందులో సీఐ ప్రతాప్ పాత్రలో తారకరత్న నటించారు. ఎప్పుడో కంప్లీట్ చేసిన సినిమాలు కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. తారకరత్న 'మిస్టర్ తారక్' సినిమా ఓవర్సీస్ ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమాను ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.
Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలకు పలు కారణాలు ఉంటాయి. హీరోగా ఆశించిన విజయాలు లభించకున్నా... తన లోపం లేకుండా తారకరత్న పని చేశారు. అందరితో సత్సంబంధాలు కొనసాగించారు. క్లుప్తంగా ఆయన పేరు కూడా ఎన్టీఆరే. నాలుగు పదుల వయసు నిండకుండా ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళడం బాధాకరమని పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)