Longlegs Movie: వాళ్లంతా కుటుంబ సభ్యులను చంపి ఎందుకు ఆత్యహత్య చేసుకుంటున్నారు? ఆ ‘బొమ్మ’ వెనుక కథేంటీ?
Longlegs Movie: 20 ఏళ్ల క్రితం జరిగిన హత్యలను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ఎఫ్‌బీఐ అధికారి రంగంలోకి దిగుతుంది. చివరికి తన తల్లి కూడా ఈ హత్యల్లో నిందితురాలను అని తెలుసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది?
Longlegs Movie Review: హాలీవుడ్‌లో చేతబడి, మూఢనమ్మకాలు కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలు చాలా తక్కువ. అలా వచ్చిన సినిమాలు ఎక్కువగా హారర్ జోనర్‌లోనే ఉంటాయి. ఇంగ్లీష్ చిత్రాల్లో వయొలెన్స్ చూపించడంలో పెద్దగా హద్దులు పెట్టుకోరు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్‌తో వచ్చిన సినిమాలు చాలామంది ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. ప్రస్తుతం అదే కాన్సెప్ట్‌తో వచ్చిన ఒక మూవీ థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అదే ‘లాంగ్ లెగ్స్’ (Longlegs). ఆస్గుడ్ పెర్కిన్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
కథ..
‘లాంగ్ లెగ్స్’ కథ విషయానికొస్తే.. 1970ల్లో ఈ కథ మొదలవుతుంది. ఒరెగాన్ ప్రాంతంలో ఒక చిన్న పాప తన ఇంటి వెనకాల నుంచి ఏదో శబ్దం వస్తుందని తన కెమెరాతో ఫాలో అవుతూ వెళ్తుంది. అక్కడే ఒక మధ్య వయసు ఉన్న వ్యక్తి తనకు కనిపిస్తాడు. తను ‘లాంగ్ లెగ్స్’ ధరించానని చెబుతాడు. ఆ పాపకు హ్యాపీ బర్త్ డే చెప్తూ ఆమె దగ్గరకు వెళ్తాడు. కట్ చేస్తే.. కథ 1990కు వస్తుంది. లీ హార్కర్ (మైకా మాన్రో) ఒక ఎఫ్‌బీఐ ఏజెంట్. ఎప్పటికీ పరిష్కారం కాలేవు అనుకునే కేసుల్లో కూడా ఒక చిన్న క్లూను వెతికి వాటిని పరిష్కరించడంలో లీ దిట్ట అని పేరు తెచ్చుకుంటుంది. అందుకే 20 ఏళ్ల క్రితం పరిష్కారం కాని కొన్ని మర్డర్ కేసులను తనకు అప్పగిస్తారు.
లీ హార్కర్‌కు అప్పగించింది ఒక సీరియల్ మర్డర్ కేసు. ఒరెగాన్‌లో 20 ఏళ్ల క్రితం చాలా కుటుంబాల్లో తండ్రి.. దభార్యను, కూతురిని హత్య చేసి ఆ తర్వాత తాము కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. అలా జరిగిన ప్రతీ క్రైమ్ సీన్‌లో పోలీసులకు ఒక లెటర్ దొరుకుతుంది. అది సైతాన్ భాషలో ఉంటుంది. ఆ లెటర్‌లో ఉండేదానికి అర్థం ‘లాంగ్ లెగ్స్’. చనిపోయినవారిలో ఎవరూ కూడా ఈ లెటర్ రాయలేదని లీ కనుక్కుంటుంది. అంతే కాకుండా ఆ సమయంలో ఎవరూ బలవంతంగా మర్డర్స్ జరిగిన ఇళ్లల్లోకి రాలేదని గ్రహిస్తుంది. జరిగిన హత్యలు అన్నింటిలో కామన్ పాయింట్స్‌ను లీ వెతకడం మొదలుపెడుతుంది. ప్రతీ మర్డర్‌లో చనిపోయిన అమ్మాయి వయసు 9 ఏళ్లు అయ్యింటుందని, తన బర్త్ డే 14 తారీఖు అయ్యింటుందని, తన పుట్టినరోజుకు కొన్నిరోజులు ముందు లేదా తర్వాత ఈ మర్డర్స్ జరుగుతున్నాయని తను కనుక్కుంటుంది.
తను కనిపెట్టిన క్లూ ప్రకారం.. లీ తన సహచరుడు కార్టర్‌తో కలిసి ఒక మర్డర్ జరిగిన ఇంటికి వెళ్తుంది. అక్కడే ఒక పాతిపెట్టిన బొమ్మను తను తవ్వితీస్తుంది. ఆ బొమ్మ తలలో తనకు ఒక గాజు వస్తువు దొరుకుతుంది. ఆ వస్తువులో చూస్తే భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. అలా ప్రతీ మర్డర్ జరిగిన ఇంట్లో అలాంటి ఒక బొమ్మ, అందులో ఆ వస్తువు ఉంటాయి. దాన్ని బట్టి చూస్తే ఆ బొమ్మతో చేతబడి చేసి హత్యలు జరిగేలా చేస్తున్నారని లీ సందేహపడుతుంది. అప్పటికే లాంగ్ లెగ్స్‌కు, తనకు ఏదో సంబంధం ఉందని లీ గ్రహిస్తుంది. అందుకే తన చిన్నప్పటి పుట్టినరోజు ఫోటోలను వెతుకుతుండగా అందులో ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనిపిస్తాడు. అతడే లాంగ్ లెగ్స్ అని లీకు అర్థమవుతుంది. వెంటనే అతడిని కనిపెట్టి అరెస్ట్ చేస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్‌లో అతడి చేసే ప్రతీ హత్య వెనుక లీ తల్లి రూత్ హస్తం కూడా ఉందని లాంగ్ లెగ్స్ చెప్తాడు. ఇంతకీ ఏంటా సంబంధం? లీ తల్లి ఇందులో ఎలా భాగమయ్యింది? అనేది తెరపై చూడాల్సిన కథ.
హారర్ ప్లస్ థ్రిల్లర్..
‘లాంగ్ లెగ్స్’ చూస్తున్నంత సేపు ఈ కథను పలు ఇండియన్ సినిమాల్లో చూశాం కదా అని అనిపిస్తుంటుంది. కానీ హీరోయిన్ అయిన మైకా మాన్రో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నంతసేపు అసలు కథలో తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇలాంటి ఒక సీరియల్ కిల్లర్ కథకు మూడనమ్మకాన్ని, సైతాన్ అనే అంశాన్ని యాడ్ చేస్తారని చాలావరకు ఎవరూ ఊహించలేరు. అలా ‘లాంగ్ లెగ్స్’ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తోంది. ఒక మంచి హారర్ ప్లస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూడాలంటే థియేటర్లలో అందుబాటులో ఉన్న ‘లాంగ్ లెగ్స్’పై ఓ లుక్కేయండి.