4k అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీతో ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్ - ట్రైలర్ వచ్చేసింది చూశారా?
సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాని మే 31వ తేదీన రీరిలీజ్ చేస్తున్నారు. తాజాగా రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు.
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసిన ఘనత ఈయనదే. అంతేకాదు సినిమా స్కోప్, ఈస్ట్ మన్ కలర్, 70mm లాంటి సాంకేతిక హంగులను తెలుగు పరిచయం చేసింది కూడా ఈయనే. కేవలం హీరో గానే కాదు నిర్మాతగా కూడా ఆయన పలు సినిమాలను నిర్మించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన మొదటి కౌబాయ్ మూవీ 'మోసగాళ్లకు మోసగాడు'. అప్పట్లో ఈ సినిమా ఓ సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. 1971 ఆగస్టు 27న విడుదలైన ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో ఓ కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. కేవలం తెలుగులోనే కాదు ఇండియా మొత్తంలోనే ఇదే మొట్టమొదటి కౌబాయ్ మూవీ. ఈ సినిమాతోనే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రిలీజ్ చేశాడు. ఈ సినిమా తర్వాతే దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో కౌబాయ్ సినిమాలు వచ్చాయి.
ఇక కృష్ణ గారి తర్వాత ఆయన వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు 'టక్కరి దొంగ' సినిమాలో కౌబాయ్ గా కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 1960లో హాలీవుడ్ లో వచ్చిన కొన్ని కౌబాయ్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాను తీశారు. కేఎస్ఆర్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ సినిమాను నిర్మించారు. 18వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో బొబ్బిలి ప్రాంతంలో జరిగిన కథగా ఈ సినిమాను చిత్రీకరించారు. అమరవీడు వంశానికి చెందిన కనిపించకుండా పోయిన ఓ నిధి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇక తెలుగులో భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత తమిళంలోనూ రిలీజ్ అయి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలా సుమారు 52 ఏళ్ల కింద వచ్చిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా మళ్లీ రీరీలీజ్ అవ్వబోతోంది. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి మే 31వ తేదీన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
అంతేకాదు ఈ సినిమాని 4K ultra HD క్వాలిటీతో రీరిలీజ్ చేస్తూ ఉండడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో సూపర్ స్టార్ కృష్ణ గుర్రంపై కౌబాయ్ గా స్వారీ చేసే సీన్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చివరలో 'మోసగాళ్లకు మోసగాన్ని మాత్రమే కాదు. మంచి వాళ్ళకి మంచి వాడిని కూడా' అంటూ సూపర్ స్టార్ కృష్ణ చెప్పే డైలాగ్ కూడా అదిరిపోయింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. కాగా తెలుగు చిత్ర పరిశ్రమంలో సుమారు 350 కి పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15వ తేదీన అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇక ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను మహా ప్రస్థానంలో నిర్వహించారు.
Also Read: సంగీత దర్శకుడు రాజ్ అంత్యక్రియలు పూర్తి - మిత్రుడ్ని కడసారి చూసి కనీళ్లు పెట్టుకున్న కోటి!