Peddha Kapu 1 Theatrical: 'పెదకాపు' ట్రైలర్ - మీకే అంతుంటే మాకెంతుడాలిరా - ఆత్మ గౌరవమా? కొవ్వా?
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెదకాపు'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. పొలిటికల్ డ్రామా తో వస్తున్న 'పెదకాపు' ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.
టాలీవుడ్ లో 'కొత్త బంగారులోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', వంటి క్లాస్ మూవీస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల రీసెంట్ టైమ్స్ లో విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' లాంటి రా అండ్ రస్టిక్ సబ్జెక్టు డీల్ చేసి తాను కూడా మాస్ మూవీస్ ని హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే మరో రియాలిస్టిక్ మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెదకాపు'. ఓ సామాన్యుడి సంతకం అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నాడు.
'జయ జానకి నాయక', 'అఖండ' వంటి సినిమాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్న ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడే ఈ విరాట్ కర్ణ. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీతో మరోసారి తనలోని పూర్తి మాస్ ని బయట పెట్టబోతున్నారు శ్రీకాంత్ అడ్డాల. ఈ క్రమంలోనే ఓ సామాజిక వర్గానికి చెందిన పేరుని టైటిల్ గా పెట్టి సినిమాపై ఆసక్తిని కనబరిచాడు. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా చేసింది. ట్రైలర్ లోనే సినిమా కథాంశం ఏంటో చెప్పేశారు.
"ఒక ఆడది నూతిలో పడి.. ఆకాశం తప్ప ఆదుకునే వాడు లేక, అరిస్తే వినిపించుకునే వాడు లేక వెళ్లిపోయింది" అని తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఒక ఊరిలో ఇద్దరు పెద్ద మనుషుల మధ్య చిక్కుకొని ఎన్నో బాధలు పడుతున్న సామాన్య జనం అణచివేత, ఘర్షణ నేపథ్యంలో సాగుతూ వారి నుంచి ఓ హీరో పుట్టి వాళ్లపై తిరగబడి ఎలా పోరాటం చేశారు అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. సినిమాలో శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ట్రైలర్ లో ఆయన కూడా డైలాగ్ తో ఆకట్టుకున్నారు. ‘‘మీద చేయి వేసినప్పుడే తలకాయలు తీసి ఉంటే, నా కొడకా ఇంత దూరం వచ్చేది కాదు" అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ‘‘మీకే అంతుంటే మాకెంత ఉండాలిరా..?’’ అనే డైలాగ్‌తో ఉత్కంఠభరితంగా ట్రైలర్ సాగింది. ‘‘నుంచున్నవాళ్లను నుంచున్నపళంగా తలలు నరికేయండిరా, ఆత్మ గౌరవమా తొక్క’’ అనే శ్రీకాంత్ అడ్డాల డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది.
పొలిటికల్ డ్రామాతో రూపొందిన ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల తనదైన శైలిలో రా అండ్ రెస్ట్ గా తెరకెక్కించాడు. ట్రైలర్ కి మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే 'పెదకాపు' తో శ్రీకాంత్ అడ్డాల మరో ఊర మాస్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు. ఇక ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
సినిమాలో విరాట్ కర్ణ సరసన ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తనికెళ్ల భరణి, నాగబాబు, రావు రమేష్, అనసూయ, ఈశ్వరి రావ్, బ్రిగడ సగ, నరేన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా, మార్తాండ్ కే. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. రెండు భాగాలుగా ఈ రాబోతున్న ఈ సినిమా పార్ట్- 1 ని సెప్టెంబర్ 29 విడుదల చేస్తున్నారు.
Also Read : శివాజీకి వేలు చూపించిన ప్రియాంక, నేను ఎవడి మాట వినను అన్న శివాజీ - రెండో వారం వాడివేడిగా సాగిన నామినేషన్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial