SP Charan: 'కీడా కోలా' మూవీ టీమ్ తీరుపై ఎస్పీ చరణ్ ఆగ్రహం
SP Charan : 'కీడా కోలా సినిమా టీంకి ఎస్పీ చరణ్ లీగల్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, వాళ్లు ఇచ్చిన రెస్పాన్స్ పై ఆయన తీవ్రంగా అప్ సెట్ అయ్యారట.
SP Charan is deeply upset with Keeda Cola team: దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు 'కీడా కోలా' టీమ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌ను రిక్రియేట్ చేసి తమ సినిమాలో వాడుకున్నారని 'కీడా కోలా' యూనిట్‌పై చరణ్ మండిపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వాళ్లకు నోటీసులు కూడా జారీ చేశారు ఆయన. "పర్మిషన్ లేకుండా, ఫ్యామిలీ మెంబర్స్‌కు తెలియకుండా ఎలా వాడతారు" అంటూ ప్రశ్నించారు. అయితే, ఆయన లీగల్ నోటీసులకు 'కీడా కోల' టీమ్.. సరిగ్గా స్పందించలేదని తెలుస్తోంది. దీంతో వాళ్లపై ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లీగల్ గానే వెళ్తాం..
‘‘వాళ్లు ఇచ్చిన సమాధానం చాలా అప్ సెట్ చేసింది. ఏఐ ద్వారా బాల సుబ్రహ్మణ్యం గారి గొంతును వాడుకున్నారనే విషయం ఇప్పటికే ప్రూవ్ అయినా కూడా దాన్ని తోసిపుచ్చారు. అంతేకాకుండా లీగల్ అప్రోచ్‌ను తిరస్కరిస్తూ మీడియా ట్రైల్ సూచిస్తున్నారు. కానీ, మాకు అది అమోదయోగ్యం కాదు. మీడియా ట్రైల్ మాకు ఇష్టం లేదు. లీగల్ గానే వెళ్లాలి అనుకుంటున్నాను” అంటూ చెప్పారు ఎస్పీ చరణ్.
తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో చైతన్య రావు, జీవన్, విష్ణు, బ్రహ్మానందం తదితర నటులు కీలక పాత్రలో నటించిన సినిమా 'కీడా కోలా'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే, ఈ సినిమాలోని ఓ కామెడీ సీక్వెన్స్‌లో భాగంగా లెజండరి సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్‌ను వాడారు. ఓ సన్నివేశంలో 'స్వాతిలో ముత్యమంత' అనే సాంగ్‌ను కామెడీ సీక్వెన్స్ కోసం వాడారు.
ఏఐ ద్వారా ఎస్సీబీ వాయిస్‌తో సాంగ్ రీ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆయన కుమారుడు ఎస్సీ చరణ్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే దీనిపై ఆయన లీగల్ యాక్షన్‌కు దిగారు. కీడా కోలా మూవీ టీంకు నోటీసులు పంపారు. గతనెల జనవరి 18వ తేదీన సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సహా సినీ దర్శక-నిర్మాతలకు కూడా ఆయన నోటీసులు పంపారు.
"మాకు దూరమైన మా తండ్రి వాయిస్‌ని ఏఐ ద్వారా రీక్రియేట్ చేయడం మంచి విషయమే. చనిపోయినా ఆయన గొంతుకు మళ్లీ జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేం స్వాగతిస్తున్నాం. కానీ, దీనిపై కనీసం మాకు ముందస్తు సమాచారం ఏం లేదు. మా అనుమతి లేకుండా ఆయన గొంతును రీక్రియేట్ చేయడం మాకు బాధ కలిగించింది. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరికాదు’’ అని గతంలో ఎస్పీ చరణ్ కామెంట్స్ చేశారు.