(Source: ECI/ABP News/ABP Majha)
SPB First Death Anniversary: పాటల తోటమాలి మనల్ని వదిలి నేటికి ఏడాది.. నీ పాట మిగిలే ఉంది.. మిగిలే ఉంటుంది..
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కానరాని లోకాలకు తరలిపోయి సంవత్సరం అయింది. ఎస్‌పీబీని తలచుకుంటే ఇప్పటికీ గుండెలు కన్నీటి సంద్రాలే.
ఆబాల గోపాలాన్ని అలరించి..పాలించి... లాలించిన ఆ దివ్యగళం మూగబోయి ఏడాదైంది. యాభైఏళ్లుకు పైగా సినీ సీమను సుసంపన్నం చేసిన పాటల తోటమాలి... సెలవు తీసుకుని సంవత్సరం అయింది. అవును శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం తొలి వర్థంతి నేడు..! మాటని మంత్రంగా చేసి.. పాటని పావనం చేసిన ఆ గొంతు నేరుగా వినిపించక ఏడాది అవుతోంది. ప్రపంచానికి కీడులా దాపురించిన కరోనా రక్కసి ... బాలునీ చేరినప్పుడు.. ఏమవుతుందో అన్న ఆందోళన...! అభిమాన గాయకుడు.. సురక్షితంగా కోలుకోవాలన్న తపన.. ఆయన దూరం అయ్యారని తెలిశాక..కోట్లాది గొంతుల మౌన రోదన.. అన్నింటికీ ఏడాదైంది.
అమృతం తాగిన వారు.. దేవతలు... దేవుళ్లు.. ! అని బాలూ పాడారు. అమృతం తాగితే.. చిరంజీవులు అయిపోతే.. నా పాట పంచామృతం అంటూ.. మనందరికీ ప్రతిరోజూ.. గానామృతాన్ని పంచే బాలసుబ్రమణ్యం అంతకంటే ఎక్కువ యశస్సును... చిరాయష్షును పొందుతారు కదా.. బాలూ దూరమైనప్పుడే ఆయన అభిమానులు అనుకున్నారు.. బాలూకు మరణం ఏంటని... పాటను బాలూను ఎలా వేరు చేస్తామని..! అందుకే ఆయన లేరు కానీ.. ఆయన పాట అలాగే ఉంది. పెద్దవాళ్లు పాడుకునే భక్తి పాటల్లో... మహిళలు మననం చేసుకునే మంచిపాటల్లో ..మధ్య వయసు వాళ్లు గుర్తు చేసుకునే హుషారు పాటల్లో .. మనసుల్లో ... మాటల్లో ..ఊహల్లో.. ఇళ్లలో ..టీవీల్లో ..కార్లలో... ఫోన్లలో ఇలా ప్రతీ చోటా బాలూనే.. అసలు బాలూ లేనిదెక్కడ.. !
బాలూ పాటకు రీప్లేస్‌మెంటూ.. బాలూ మాటకు రీ అరెంజ్‌మెంటూ ఉండవ్. తెలుగునాట పుట్టి దిగంతాలకు వ్యాపించిన సమ్మోహనపరిమిళం ఆయన...! తీరులు మారినా.. తరాలు బాలూ క్రేజ్ అలాగే ఉంది అంటే.. అది ఆయనకే సాధ్యమైంది. ఐదేళ్ల పిల్లలు కూడా టీవీలో ఆయన పాట వస్తే.. ఇది బాలూ తాతయ్య పాడారు కదా... అని చెప్పుకునేలా చేయగలగడం ఆయనకే చెల్లింది. పెద్ద వాళ్లకు కూడా ఆరాధ్యనీయుడుగా ఉండే బాలూ... చిన్నపిల్లలతో కూడా ఇట్టే కలిసిపోతారు. 70 ఏళ్ల లెజండరీ సింగర్.. చిన్న చిన్న వేదికలపై కూడా అప్పుడే వస్తున్న పిల్లలతో కలిసి గొంత కలుపుతారు. మాటను మంత్రంగా చేసిన మార్గనిర్దేశనం చేస్తారు. బాలూ పాట, మాట, బాట అన్నీ వేరు వేరుగా లేవు. ఆయన ఒక పాటల ప్రవాహం అంతే.
లాలి పాటలు, జోలపాటలు, చిలిపిపాటలు, కొంటెపాటలు, భక్తి పాటలు , ముక్తి పాటలతో రక్తి కట్టించారు.. దివిలో విరిసిన పారిజాతాలను మా పెరటిలో పరిమళింపజేశారు. నాదోపాసనతో సంకీర్తనార్చనలు చేశారు. కుర్రాళ్లోయ్.. కుర్రాళ్లు అంటూ బాలూ హుషారుగా కేకేస్తే.. ఆ రోజుల్లో వెర్రెక్కని కుర్రాడే లేడు. నను నేను మరిచినా ఈరోజు.. విరహాన వేగుతూ ఈనాడు అంటూ నడివయసులో బాలూ ప్రేమదేశంలో ఆలపిస్తే.. లేత కుర్రాళ్లు కూడా పాడింది ఎవరో మర్చిపోయారు. అంతే మరి.. ఎన్టీఆర్‌కు పాడినా... ఏఎన్నార్‌కు పాడినా... చివరకు అబ్బాస్ వినీత్‌లకు పాడినా కూడా సినిమాలో ఉన్నవాళ్లే పాడుతున్నారేమో అనుకునేలా మాజిక్ చేయడం ఆయనకు మాత్రమే.. తెలిసిన విద్య.. అంతెందుకు 70 ఏళ్ల వయసులో కూడా ఈ మధ్య శర్వానంద్ కు పాడిన "నిలువదే మరి నిలువదే " పాటను విన్నా.... డిస్కో రాజాలో .. "నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో" పాట విన్నా... 80లలో బాలూకి.. ఇప్పటి బాలూకి ఏం తేడా ఉండదు... సేమ్ టూ సేమ్. టైమ్ మారిందంతే బాలూ కాదు.
అలాంటి గళం కాబట్టే.. అన్ని భాషలు అందలం ఎక్కించాయి. దక్షణాది మొదలుకుని ఉత్తరాది వరకూ అన్ని భాషల్లో ఆయనదే సింగిల్ కార్డు.16 భాషల్లో 40 వేల గీతాలు పాడిన రికార్డు మరెవ్వరికీ సాధ్యమయ్యేది కాదు కదా... ! ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల వంటి మహామహుల కలాన్ని బాలు గొంతు పలికించింది. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కమల్, రజనీ, చిరు వంటి గొప్ప నటుల అభినయానికి తావిచ్చింది. అన్నమయ్య, రామదాసు వంటి సినిమాల్లో ఆ దివ్యగళం.. దేవభాషను పలికించి.. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే మాట్లాడుతున్నాడా అని భ్రమింపజేసింది. ఇంతటి ఘనతను.. ఇంతమంది సాంగత్యాన్ని , కోట్లాది మంది అభిమానాన్ని పొందిన బాలూ ఎంతటి ధన్యుడో కదా.. ! కాదు బాలూ లాంటి గాయకుడిని పొందిన మనమే ధన్యులం.. అంటారు... ఆయన అభిమానులు.. !
Also Read: Mahesh Babu: మా అమ్మాయి తెలుగు సినిమాలు చేయదు.. ఆమెతో పనిచేయడం ఇబ్బందే: మహేష్ బాబు