మూడొందలతో ఇంటి నుంచి వచ్చేసిన కుర్రాడు... ఇప్పుడు పాన్ ఇండియా హీరో - ఒకప్పుడు టీ సర్వర్‌గా చేసిన అతనెవరో తెలుసా?
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న ఓ హీరో కెరీర్ మొదట్లో నటీనటులకు టీ సర్వ్ చేసేవారు. కేవలం రూ. 50కే డ్రామా ట్రూప్ లో పని చేశాడట. ఈ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం.

సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్ గా పేరు తెచ్చుకున్న నటులు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే ప్రస్తుతం కెరీర్ లో ఈ రేంజ్ పీక్స్ చూస్తున్న ఈ హీరోలు గతంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్న ఓ హీరో అయితే ఏకంగా టీని కూడా సర్వ్ చేశాడు. కేవలం రూ. 300 రూపాయలతో ఇల్లు వదిలి వచ్చేసి, హీరో అయ్యాక రూ. 1300 కోట్ల సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఆ హీరో ఎవరో ఇంకా గుర్తు పట్టలేదా? ఈ పాన్ ఇండియా స్టార్ మరెవరో కాదు 'కేజీఎఫ్' హీరో యష్.
పదో తరగతిలోనే చదువు ఆపేయాలనుకున్నాడు
కన్నడ సూపర్ స్టార్ యష్ 1986 జనవరి 8న కర్ణాటకలోని భువనహళ్లిలో జన్మించారు. ఆయన తల్లి పుష్ప హౌజ్ వైఫ్, తండ్రి అరుణ్ కుమార్ బస్ డ్రైవర్ గా పని చేసేవారు. ఆయన యష్ ఈ రేంజ్ లో సక్సెస్ సాధించిన తర్వాత కూడా ఇప్పటికీ బస్ డ్రైవర్ గానే చేస్తున్నట్టు సమాచారం. అలాగే కర్ణాటకలోని మైసూర్ లో ఉన్న మహాజన హైస్కూల్లో యష్ చదువుకున్నాడు. అయితే టెన్త్ క్లాస్ లోనే ఆయన యాక్టర్ కావాలనే ఆశతో చదువు ఆపేయాలని అనుకున్నాడట. కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో చదువును పూర్తి చేయాల్సి వచ్చింది.
'జంబాడ హుడుగి' అనే సినిమాతో 2007లో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యష్. ఇందులో ఆయన సపోర్టింగ్ రోల్ చేసినప్పటికీ ప్రశంసలు రావడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. యష్ చేసిన మొగ్గిన మనసు, డ్రామా, గూగ్లీ, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, మాస్టర్ పీస్, సంతు స్ట్రైట్ ఫార్వర్డ్, కేజీఎఫ్ చాప్టర్ వన్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
'నంద గోకులా' (2004) అనే సీరియల్ చేస్తున్న టైంలో యష్ తన భార్య రాధిక పండిట్ ని ఫస్ట్ టైం కలిశాడు. ఇద్దరూ కలిసి మొగ్గిన మనసు, డ్రామా అనే సినిమాలు చేశారు. ఆ తర్వాత క్లోజ్ కావడంతో బాండింగ్ పెరిగింది. ఆగస్టు 12, 2016లో గోవాలో యష్ - రాధిక ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. డిసెంబర్ 9, 2016లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఒక అమ్మాయి ఆర్య, అబ్బాయి యథర్వ్ ఉన్నారు. అయితే యష్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎలా స్ట్రగుల్ అయ్యాడు అనే విషయాన్ని గతంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కేవలం 300 రూపాయలు పర్స్ లో పెట్టుకొని యష్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారట. ఆ తర్వాత ధైర్యంగా ముందడుగు వేసి, పదహారేళ్ళ వయసులోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం మొదలుపెట్టాడు. కానీ స్టార్ట్ అయిన రెండు రోజుల్లోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందట. అలాంటి భయంకరమైన సిచువేషన్ లో బెంగళూరు లాంటి సిటీలో బ్రతకడం కష్టమని భావించిన ఈ హీరో 'బెనక' అనే డ్రామా ట్రూప్లో కేవలం 50 రూపాయలకే బ్యాక్ స్టేజ్ వర్కర్ గా పని చేశాడట. అంతేకాకుండా అక్కడ నటీనటులకు టీ అందించడం నుంచి మొదలు పెడితే, ప్రొడక్షన్ రిలేటెడ్ వర్క్ వరకు చాలా నేర్చుకున్నాడట. 2024లో ఈ హీరోకి ఆ డ్రామా ట్రూప్ లో మెయిన్ యాక్టర్ గా నటించే ఛాన్స్ దక్కింది. యష్ బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఇక 2005లో ఈ హీరో సీరియల్ లో ఛాన్స్ పట్టాడు. 'కేజీఎఫ్'తో ఆయన కెరీర్ పాన్ ఇండియా మలుపు తిరిగింది. ఈ మూవీ సెకండ్ పార్ట్ దాదాపు 1300 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.





















