Sitara Ghattamaneni: అలాంటి వాళ్లను వెంటనే బ్లాక్ చేస్తాను, నా ఫేవరెట్ హీరోయిన్స్ వాళ్లే - సితార ఘట్టమనేని
Sitara Ghattamaneni: మహేశ్ బాబు వారసురాలు సితార ఘట్టమనేని తాజాగా తెలుగు డిజిటల్ మీడియా ఇన్‌ఫ్లుయెనర్లతో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. వారితో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేశ్ బాబు వారసురాలు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కొందరు డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి ఒక ఇంటర్వ్యూలో ఏర్పాటు చేసింది సితార. ఇందులో ఇన్‌ఫ్లుయెన్సర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మహేశ్ బాబులాగానే సితార కూడా చారిటీ పనుల్లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. దానిపై స్పందిస్తూ తనలాగా ఇతర పిల్లలు కూడా చదువుకోవడం చాలా ముఖ్యమని తాను భావిస్తానని చెప్పుకొచ్చింది సితార ఘట్టమనేని. అందుకే వారికి పుస్తకాలు, సైకిల్స్ డొనేట్ చేస్తుంటానని తెలిపింది.
అన్నీ నచ్చుతాయి..
మిగతా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఏం సలహా ఇస్తారు అని అడగగా.. ‘‘కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి భయపడొద్దు’’ అని చెప్పింది సితార ఘట్టమనేని. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంపై స్పందిస్తూ ‘‘ముందు ఇంటికి రాగానే హోమ్ వర్క్ పూర్తి చేస్తాను. ఆ తర్వాత రీల్స్ చేస్తాను’’ అని తెలిపింది. తన తండ్రి నటించిన సినిమాల్లో ఏ పాత్ర రీక్రియేట్ చేయాలని ఉంది అని అడగగా.. ‘‘నేను ఖలేజాలోని సీతారామరాజు పాత్ర పోషించాలని అనుకుంటున్నాను’’ అని బయటపెట్టింది. మహేశ్ బాబు సినిమాల్లో తనకు నచ్చనిది ఏదీ లేదని, అన్నీ నచ్చుతాయని చెప్పుకొచ్చింది. ఇంట్లో అమ్మ, నాన్న ఎవరూ స్ట్రిక్ట్ కాదని చెప్తూ నవ్వింది సితార.
వెంటనే బ్లాక్ చేస్తాను..
ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే సితారకు స్టైలింగ్ విషయంలో ఎవరు ఇన్‌స్పిరేషన్ అని అడగగా.. ముందుగా తన తల్లి అని చెప్పి, తనతో పాటు జూలియా రాబర్ట్స్‌ను కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటానని తెలిపింది సితార. తన ఫేవరెట్ ఫుడ్ మ్యాగీ అని బయటపెట్టింది. తన కలల గురించి చెప్తూ ‘‘నేను కచ్చితంగా హీరోయినే అవ్వాలని అనుకుంటున్నాను. నాకు యాక్టింగ్ చాలా ఇష్టం. నేను జ్యువలరీ యాడ్ చేసినప్పుడు, పెన్నీ మ్యూజిక్ వీడియో చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. సెట్స్‌లో బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇంకా చిన్నపిల్లనే కాబట్టి ఇంకా ఆలోచిస్తున్నాను’’ అని తెలిపింది సితార. తన కాంటాక్ట్ విషయంలో తన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకొచ్చింది సితార ఘట్టమనేని. ఎవరైనా తనను ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తే వెంటనే బ్లాక్ చేసేస్తానని తెలిపింది.
ఎప్పుడూ చిరాకుపెడుతుంటాడు..
తన అన్నయ్య గౌతమ్ గురించి మాట్లాడుతూ ‘‘ఎప్పుడూ చిరాకుపెడుతుంటాడు. కానీ తనంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా చేయడం సేఫ్ కాదు అనిపిస్తే చెప్తాడు. తను నాకంటే చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తిస్తాడు. నాకంటే పెద్ద అంటే నేనే నమ్మలేను’’ అని చెప్పింది సితార. తన ఫేవరెట్ హీరోయిన్లు రష్మిక మందనా, శ్రీలీల అని బయటపెట్టింది. తాజాగా మంజుల ఘట్టమనేని, మహేశ్ బాబు జుట్టును టచ్ చేసిన వీడియో వైరల్ అవ్వడంపై కూడా సితార స్పందించింది. ‘‘ఆయనకు ఎవరైనా హెయిర్ టచ్ చేస్తే అస్సలు నచ్చదు’’ అని తెలిపింది. ‘‘మా అమ్మ దగ్గర నుండి ఫ్యాషన్ సెన్స్ నేర్చుకుంటాను. మా నాన్న దగ్గర నుండి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటాను. ఆయన గొప్ప యాక్టర్’’ అని తన తల్లిదండ్రుల క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చింది సితార.