Shilpa Shetty 60 Crore Case: శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా దంపతులపై 420 సెక్షన్... 60 కోట్లు ఫ్రాడ్ కేసులో లేటెస్ట్ అప్డేట్
బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి - రాజ్ కుంద్రాకు కష్టాలు తప్పడం లేదు. వీళ్లపై కొత్తగా ఐపీసీ సెక్షన్ 420 కేసు నమోదు అయ్యింది. రూ. 60 కోట్లు మోసం చేసిన కేసులో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా (Shilpa Shetty Raj Kundra)లకు కష్టాలు తగ్గడం లేదు. ఒక కేసు నుంచి బయట పడితే... మరో సమస్యలో ఈ జంట చిక్కుకుంటోంది. రూ. 60 కోట్ల ఫ్రాడ్ కేసులో ఆర్థిక నేరాల విభాగం (EOW) దర్యాప్తును విస్తరిస్తూ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 420 (మోసం)ని చేర్చింది.
కొనసాగుతున్న దర్యాప్తు
శిల్పా - రాజ్ 60 కోట్ల ఫ్రాడ్ కేసులో వాళ్ళిద్దరిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఫిర్యాదుదారు లాయర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో... దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వాస్తవాల ఆధారంగా, EOW IPC కఠినమైన సెక్షన్ 420ను చేర్చిందని, ఆ విషయాన్ని సంబంధిత మేజిస్ట్రేట్‌కు తెలియజేసిందని పేర్కొంది. దర్యాప్తులో నమ్మదగిన సాక్షుల వాంగ్మూలాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను సేకరించినట్లు EOW కోర్టుకు తెలియజేసింది.
రికార్డులలోని విషయాలు ఈ కేసులో 60 కోట్ల రూపాయలకు పైగా ఫిర్యాదుదారు మోసానికి గురయ్యారని సూచిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు దీపక్ కొఠారి త్వరలో త్వరలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ EDని కూడా సంప్రదించవచ్చు.
లండన్ వెళ్ళడానికి అనుమతి కావాలి
ఇటీవల విచారణలో లండన్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసిందిగా రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి జంట కోర్టును కోరింది. రాజ్ కుంద్రా తండ్రి ఆరోగ్యం బాగా లేదని వారు చెప్పారు. అయితే కోర్టు అనుమతి ఇవ్వడానికి స్పష్టంగా నిరాకరించింది. విదేశాలకు వెళ్లేందుకు పిటిషనర్ కోర్టులో మొత్తం 60 కోట్ల రూపాయలు జమ చేస్తేనే అనుమతి ఉంటుందని కోర్టు స్పష్టంగా ఆదేశించింది.





















