Lathasri: రాజేంద్ర ప్రసాద్ వల్ల ఈవీవీతో తిట్లు తిన్నా- వాళ్లు ఏది చెప్పినా చెయ్యాలి: సీనియర్ నటి లతశ్రీ
Actress Lathasri: ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన లతశ్రీ.. ఇప్పుడు బుల్లితెరపై నటిగా ఫిక్స్ అయిపోయారు. ఆమె సినిమాల్లో నటిస్తున్నప్పటి అనుభవాలను తాజాగా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
Senior Artist Lathasri: 90ల్లో ఎంతోమంది హీరోలకు చెల్లెలిగా, మరదలుగా నటించి.. కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు లతశ్రీ. ఒకప్పటి ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ లతశ్రీ మాత్రం ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ సెటిల్ అయిపోయారు. పలు సీరియల్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తూ.. తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆవిడ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అప్పటి హీరోలతో పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అసలు తనకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరనే విషయాన్ని బయటపెట్టారు.
ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు
సీనియర్ హీరో బాలకృష్ణ హీరోగా నటించిన పలు సినిమాల్లో కూడా లతశ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు. తనతో చేసిన ‘పెద్దనయ్య’ షూటింగ్ రాజమండ్రిలో జరిగిందని, అదే సమయంలో తుఫాన్ వచ్చిందని గుర్తుచేసుకున్నారు. తుఫాన్ వల్ల షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని, అప్పటివరకు ఆ షూట్‌లో చాలా ఎంజాయ్ చేశామని తెలిపారు. ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిచయాలు ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడుతూ.. ‘‘పరుచూరి గోపాలకృష్ణ ఫ్యామిలీలో ఒక వ్యక్తిలాగా ఉండేవారు. న్యూ ఇయర్‌కు వెళ్లి ఆశీర్వాదం కూడా తీసుకునేదాన్ని. ఆమని, నేను కలిసి బీచ్‌లకు తిరిగేవాళ్లం, ఒకరి ఒడిలో ఒకరం పడుకునేవాళ్లం’’ అని తెలిపారు. షూటింగ్స్‌లో కలిసి చేసినప్పుడు మాత్రం హీరోయిన్స్‌తో సరదాగా ఉంటానని, బయట ఫ్రెండ్‌షిప్స్ అనేవి పెద్దగా ఉండవని అన్నారు లతశ్రీ.
అందుకే రిజెక్ట్ చేశాను
ఇప్పటికీ తనకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటూ ఉన్నారంటే.. అది రవళి, జయలలిత మాత్రమే క్లోజ్ అని బయటపెట్టారు లతశ్రీ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంటున్న సమయంలోనే ‘యమలీల’లో ఒక స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఆ తర్వాత వరుసగా తనకు అలాంటి అవకాశాలే వచ్చాయని చెప్పుకొచ్చారు. కానీ అదే తరహాలో సాంగ్స్ చేసుకుంటూ వెళ్తే.. ఆర్టిస్ట్‌గా కాకుండా డ్యాన్సర్‌గా ముద్రపడిపోతుందని వాటిని రిజెక్ట్ చేశానని తెలిపారు. కాస్ట్యూమ్స్ కూడా వాళ్లు ఏది చెప్తే.. అది వేయాలి అని గుర్తుచేసుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వాళ్లు ఏది చెప్పినా చేయాల్సి వస్తుందని, అందుకే సాంగ్స్‌కు దూరంగా ఉన్నానని అన్నారు.
అలా సీరియస్ అయ్యారు
రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చారు లతశ్రీ. ‘‘షూటింగ్ స్పాట్‌లో మాత్రం ఆయన యాక్టింగ్ తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. కెమెరా పెట్టగానే ఏదో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. నా డైలాగ్ పోయేది. అలా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఈవీవీగారికి అది అర్థమయ్యేది కాదు. ఆయన కెమెరాకు అటువైపు ఉండేవారు. తెలియక కొన్నిసార్లు విసుక్కున్నారు. ఆయన ఎప్పుడూ ఏమనేవారు కాదు కానీ మెల్లగా తిట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పుడూ ఫస్ట్ టేక్‌లోనే ఓకే చేస్తావు కదా, నీ ప్రాబ్లెం ఏంటి, డైలాగ్ ఎందుకు చెప్పట్లేదు అని సీరియస్ అయ్యాక.. అప్పుడు ఆయనకు జరిగింది చెప్పాను.. ఇలా జరిగింది అని’’ అంటూ రాజేంద్ర ప్రసాద్ వల్ల తిట్లు తిన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు లతశ్రీ.