Chandra Mohan: ‘డీజే’ మూవీలో బన్నీ నా పార్ట్ వదిలేసి మిగతా సినిమా తీయాలన్నారు, ఆ సినిమా చేయనన్నా: చంద్రమోహన్
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్న చంద్రమోహన్, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు.
నటుడు చంద్రమోహన్ గురించి తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 23 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన 80 ఏళ్ల వయసు వచ్చే వరకు సినిమాలు చేశారు. ‘రంగులరాట్నం’ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 175 సినిమాల్లో హీరోగా నటించారు. మొత్తం తన సినీ కెరీర్ లో 600లకు పైగా చిత్రాలలో నటించారు. ఎమోషనల్ సీన్స్ చేయడంలో చంద్రమోహన్ అద్భుత ప్రతిభ కనబర్చేవారు. ఆయన చేసిన ప్రతి సీను అద్భుతంగా ఉంటుందని దర్శకులు ఇప్పటికీ కొనియాడుతుంటారు. ఎమోషనల్ మాత్రమే కాదు, కామెడీ కూడా అద్భుతంగా పండిస్తారు. ఆయన చేసిన తండ్రి క్యారెక్టర్లు నిజ జీవితంలో తండ్రి మాదిరిగానే ఉంటాయంటారు సినీ అభిమానులు.
చాలా మంది హీరోయిన్లకు లక్కీ హీరో!
ఇక ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు చంద్రమోహన్ లక్కీ హీరోగా మారారు. ఆయనతో సినిమా చేసిన ప్రతి హీరోయిన్ స్టార్ హీరోయిన్ గా మారిపోతారనే టాక్ ఉండేది. శ్రీదేవి మొదలుకొని జయసుధ వరకు చాలామంది తమ తొలి సినిమాలు చంద్రమోహన్ తో చేసి ఆ తర్వాత స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్ తో కలిసి నటించిన జయప్రద ఆ తర్వాత వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ అయ్యింది. చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా నటించిన శ్రీదేవి కూడా గొప్ప నటిగా ఎదిగింది. జయసుధ, విజయశాంతి సైతం చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా నటించిన తర్వాత చక్కటి అవకాశాలు పొందారు. చంద్రమోహన్ మాత్రం నటుడిగానే మిగిలిపోయారు.
ఇబ్బంది పెట్టలేక సినిమా చేయనని చెప్పాను- చంద్రమోహన్
అల్లు అర్జున్ తో కలిసి చంద్రమోహన్ ‘DJ: దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో నటించారు. ఇందులో డీజే మేన మామగా కనిపించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తనకు అనారోగ్య సమస్యలు వచ్చినట్లు చెప్పారు. “‘DJ: దువ్వాడ జగన్నాథం’ సినిమాలో చక్కటి సీన్లు చేశాను. ఆ సమయంలోనే నాకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. అల్లు అర్జున్ నా పార్ట్ వదిలేసి మిగతా సినిమా అంతా కంప్లీట్ చేయాలని చెప్పారు. అంతా అయ్యాక కూడా నేను రాలేదు. ఎప్పుడు వస్తారని బన్నీ అడిగాడు. వారం రోజులు అని చెప్పి కేరళకు వెళ్లా, 20 రోజులు అయ్యింది. వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే, ఇక సినిమాలో చేయనని చెప్పాను” అన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘DJ: దువ్వాడ జగన్నాధం’ 2017లో విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. 2017లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది .
Read Also: కొన్ని గంటల్లో ‘బిగ్ బాస్’ హౌస్‌కు, ఇంతలోనే విషాదం - ఆమె షో నుంచి తప్పుకున్నట్లేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial