Samantha Ruth Prabhu : మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?
Samantha - Myositis Treatment : సమంత మయోసైటిస్ చికిత్సకు ఓ ప్రముఖ తెలుగు హీరో సాయం చేస్తున్నారని, రూ. 25 కోట్లు ఇచ్చారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్తలపై ఆమె స్పందించారు.
అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) మయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితిని దాచి మరీ 'యశోద' చిత్రీకరణ పూర్తి చేశారామె! ఆ సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో సమంతకు మయోసైటిస్ అనేది తెలిసింది. 'యశోద' తర్వాత 'శాకుంతలం' చేశారు. ఇటీవల 'ఖుషి' సినిమా, 'సిటాడెల్' వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఒకవైపు మయోసైటిస్ (Myositis)కు చికిత్స తీసుకుంటూ మరోవైపు షూటింగులు చేస్తున్నారు.
సమంతకు పాతిక కోట్లు అప్పుగా ఇచ్చిన హీరో!?
ఇప్పుడు సమంత బాలిలో ఉన్నారు. చిత్రీకరణలు పూర్తి కావడంతో తన ఫ్రెండ్, మేకప్ ఆర్టిస్ట్ అనూషతో కలిసి అక్కడికి వెళ్లారు. కొన్ని రోజులుగా సముద్ర తీరంలో సేద తీరుతున్నారు. ఈ తరుణంలో సమంతపై ఇండియాలో కొత్తగా ఓ వార్త చక్కర్లు కొట్టడం ప్రారంభించింది.
సమంత మయోసైటిస్ చికిత్సకు రూ. 25 కోట్లు ఖర్చు అవుతోందని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ అగ్ర కథానాయకుడు ఆమెకు అంత డబ్బులు ఇస్తున్నారని, ఆమెతో ఉన్న స్నేహం కారణంగా ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారని ఓ ప్రచారం మొదలైంది. అది సమంత వరకు వెళ్ళింది. దాంతో ఆమె స్పందించారు.
నా బాగోగులు నేను చూసుకోగలను - సమంత
''మయోసైటిస్ చికిత్సకు రూ. 25 కోట్లా? ఎవరో మీ దగ్గరకు చాలా బ్యాడ్ డీల్ తీసుకు వచ్చారు. పాతిక కోట్లల్లో చాలా అంటే చాలా తక్కువ మొత్తం మాత్రమే నేను ఖర్చు చేస్తున్నందుకు చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను'' అని సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు.
మయోసైటిస్ చికిత్సకు పాతిక కోట్లు ఖర్చు కాదని స్పష్టం చేసిన ఆమె... తనకు ఓ టాలీవుడ్ హీరో సహాయం చేస్తున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఖండించారు. ''నా కెరీర్ మొత్తంలో చేసిన పని (సినిమాల)కి గాను నాకు రాళ్ళు ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. నా బాగోగులు నేను చూసుకోగలను'' అని సమంత చెప్పారు.
Also Read : 'భోళా శంకర్'తో ఆ లోటు తీరింది - తమన్నా ఇంటర్వ్యూ
తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల్లో సమంత ఒకరు. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఒక్కో సినిమాకు ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ రెండు కోట్లకు పైమాటే అని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. బయటకు తన పారితోషికం వివరాల్ని సమంత చెప్పలేదు కానీ తన సంపాదన బావుందని, తన చికిత్సకు అవసరమైన డబ్బులు తన దగ్గర ఉన్నాయని ఆమె పరోక్షంగా చెప్పారు.
మయోసైటిస్... వేలాది మందికి!
మయోసైటిస్ కారణంగా వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని సమంత పేర్కొన్నారు. దయచేసి చికిత్సకు సంబంధించిన వివరాలను పాఠకులకు అందించేటప్పుడు బాధ్యతతో వ్యవహరించమని సమంత సున్నితంగా క్లాస్ పీకారు. అదీ సంగతి!
Also Read : 'తంత్ర' శాస్త్రం గుట్టు విప్పే హారర్ థ్రిలర్ - హీరోగా శ్రీహరి సోదరుని కుమారుడు
థియేటర్లలో 'ఖుషి'తో సందడి చేయనున్న సమంత!
ప్రస్తుతం విదేశాల్లో విహార యాత్రలో ఉన్న సమంత... త్వరలో ఇండియా రానున్నారని సమాచారం. విజయ్ దేవరకొండకు జోడీగా ఆమె నటించిన 'ఖుషి' సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial