Sai Pallavi Bollywood Debut: హిందీలో సాయి పల్లవి ఫస్ట్ ఫిల్మ్... టీజర్ రిలీజయ్యాక ఆమిర్ రియాక్షన్ - అసలు ట్విస్ట్ ఏమిటంటే?
Aamir Khan On Ek Din Movie: ఒక దిన్ చిత్రం ప్రేమ కథతో వస్తోంది. ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ తనకు రొమాంటిక్ సినిమాలు ఇష్టమని చెప్పారు.

తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న కథానాయిక సాయి పల్లవి. గ్లామర్ రోల్స్ కాకుండా తన నటనతో, అద్భుతమైన నృత్యంతో ప్రజలలో గౌరవం సొంతం చేసుకున్న అమ్మాయి. సౌత్ సినిమాలతో స్టార్ స్టేటస్ పొందిన సాయి పల్లవి... ఇప్పుడు హిందీ సినిమాల్లో అడుగు పెడుతోంది.
'ఏక్ దిన్'తో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతోంది సాయి పల్లవి. ఆ సినిమాలో జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇటీవల మేకర్స్ సినిమా టీజర్ విడుదల చేశారు. అది మనసును హత్తుకునేలా చక్కటి అనుభూతిని కలిగించింది. లవ్, రొమాన్స్‌తో కూడిన ఒక అందమైన ప్రేమ కథను చూపిస్తుంది. ఇప్పుడీ సినిమా గురించి బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మాట్లాడారు. ఎందుకంటే...
'ఏక్ దిన్'లో హీరో జునైద్ ఖాన్ ఎవరో కాదు... ఆమిర్ తనయుడు. అంతే కాదు... సినిమా నిర్మాతల్లోనూ ఆమిర్ ఖాన్ ఒకరు. తనయుడి సినిమాకు ఆయన ప్రచారం చేస్తున్నారు. టీజర్‌లో సాయి పల్లవి ఎటువంటి మేకప్ లేకుండా ఎప్పటిలా అందంగా కనిపిస్తున్నారు. జునైద్ ఖాన్ అందమైన, కొంచెం సిగ్గుపడే ప్రేమికుడిగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ తనకు మృదువైన, రొమాంటిక్ లవ్ స్టోరీలు అంటే ఇష్టమని, 'ఏక్ దిన్' సినిమా కూడా అలాంటిదేనని అన్నారు.
ఇంకా ఆమిర్ ఖాన్ ఏమన్నారంటే?
'ఏక్ దిన్' గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ... ''ఇది స్వచ్ఛమైన క్లాసిక్ రొమాన్స్ కలిగిన సినిమా. ఒక ప్రేక్షకుడిగా నాకు ఇలాంటి మృదువైన, రొమాంటిక్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కూడా అలాంటిదే. ఒక క్లాసిక్, కొంచెం మాయాజాల ప్రేమ కథ'' అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నేను మొదటిసారి స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు ఈ కథ చాలా నచ్చింది. మేము సాయి పల్లవిని ఎంచుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఆమె నిజంగా ఒక గొప్ప నటి. అద్భుతంగా నటించింది. జునైద్ చాలా బాగా చేశాడు. అతను నా కొడుకు కాబట్టి అతని గురించి అంతకు మించి ఎక్కువ చెప్పలేను. ఇద్దరి నటన అద్భుతంగా ఉంది. దర్శకుడు సినిమాను చాలా అందంగా తీశాడు. మేము మే 1న సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాము'' అని అన్నారు.
'ఏక్ దిన్'ను ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ నిర్మించారు. 'ఖయామత్ సే ఖయామత్ తక్', 'జో జీతా వహి సికందర్', 'అకేలే హమ్ అకేలే తుమ్', 'జానే తూ... యా జానే నా' వంటి సినిమాల తర్వాత వాళ్ళిద్దరూ నిర్మించిన చిత్రమిది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించబడిన 'ఏక్ దిన్'లో సాయి పల్లవి, జునైద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణా పురోహిత్ నిర్మించారు. మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది.






















