Amaran: మేజర్ ముకుంద్‌పై శివకార్తికేయన్ బయోపిక్ - స్పందించిన ఆఫీసర్ భార్య
Major Mukund Varadarajan: సౌత్ కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా ‘అమరన్’ అనే సినిమా చేశాడు శివకార్తికేయన్. దీనిపై ముకుంద్ భార్య స్పందించారు.
Wife Of Major Mukund Varadarajan: తమిళ హీరో శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ ‘అమరన్’కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. రాజ్‌కుమార్ పెరియసామి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ టీజర్‌లో శివకార్తికేయన్ పాత్ర పేరు ముకుంద్ వీ అని టీజర్‌లో చూపించారు. దీన్ని బట్టి చూస్తే ‘అమరన్’ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ అని వార్తలు వచ్చాయి. తాజాగా ముకుంద్ వరదరాజన్ భార్య రెబెక్కా వర్గీస్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. తన భర్త జీవితంపై సినిమా రావడంపై ఆమె స్పందించారు. సినిమా చూడడానికి ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.
అశోక చక్ర గ్రహీత..
2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ వీరమరణం పొందారు. సౌత్ కశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అక్కడ ఒక సెర్చ్ ఆపరేషన్‌ను ఏర్పాటు చేశారు ముకుంద్. ఆ క్రమంలోనే ఆయన మరణించారు. ఆర్మీ ఆఫీసర్‌గా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం.. అశోక చక్ర కూడా ఇచ్చింది. ఇక ‘అమరన్’ టీజర్‌ను బట్టి చూస్తే శివకార్తికేయన్.. ‘రాష్ట్రీయ రైఫల్స్’ అనే ఒక టీమ్‌ను లీడ్ చేసే ఆఫర్‌గా నటిస్తున్నాడని తెలుస్తోంది. అదే క్రమంలో సౌత్ కశ్మీర్‌లోని ఉగ్రవాదులపై తన కన్నుపడుతుంది. ఈ సినిమాలో ముకుంద్ వరదరాజన్ ఎలా ఉగ్రవాదులను ఎదిరించి నిలబడి వీరమరణం పొందారో చూపించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ముకుంద్ భార్య ఇందు రెబెక్కా.. ఈ సినిమిపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
మనసులోని మాటలు..
‘అమరన్.. నాతో ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. అసలు దీని గురించి ఎలా రాయాలి అని వెయ్యిసార్లు ఆలోచించాను. కానీ ఎప్పటిలాగానే నేను నా మనసు నుండి వచ్చే మాటలను బయటపెడతాను. దశాబ్దం అయిపోయింది. ఇప్పుడు ఆయన జ్ఞాపకాలని, ఆయన దేశభక్తిని వెండితెరపై చూసే సమయం వచ్చేసింది. సినిమా కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాననే మాట నిజం కానీ దీంతో పాటు తట్టుకోలేని బాధ, ఎంతో ప్రేమ, ఓడిపోని ఆశ కూడా నాలో ఉన్నాయి. కష్టం, బాధ వచ్చినప్పుడు మన కుటుంబాలకు అండగా నిలబడాలి. ఒక విలువైనదాని కోసం ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంత గొప్ప విషయమో తెలిసిన ప్రతీ ఒక్కరికీ జై హింద్’ అని సినిమా గురించి చెప్తూ.. తన భర్త ముకుంద్‌ను గుర్తుచేసుకున్నారు రెబెక్కా.
పాన్ ఇండియా రేంజ్‌లో..
‘అమరన్’లో శివకార్తికేయన్‌కు జంటగా సాయి పల్లవి నటిస్తోంది. రాహుల్ బోస్, లల్లూ, మీర్ సల్మాన్, గౌరవ్ వెంకటేశ్ లాంటి ఇతర నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 2024 చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మొత్తంగా అయిదు భాషల్లో ‘అమరన్’ విడుదల కానుందని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్.. ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం విశేషం. ఇటీవల విడుదలయిన టీజర్‌లో స్టీఫెన్ రిచర్ తెరకెక్కించిన మిలటరీ రేంజ్ స్టంట్స్ యాక్షన్ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకోనున్నాయి.
Also Read: శివకార్తికేయన్, సాయి పల్లవిల ‘అమరన్’ టీజర్ : స్టంట్స్ అదుర్స్ అంతే!